Telangana: 4 లక్షల మందికి రైతుబంధు దూరం!.. కారణాలివే..

Telangana 4 Lakh Farmers Not Getting Rythu Bandhu These Reasons - Sakshi

వ్యవసాయ భూముల వివాదాలు, ధరణి సమస్యలతో ఇబ్బంది

బ్యాంకు వివరాలు సరిగా లేక పోవడం, కోర్టు కేసుల వల్ల కూడా..

యాసంగిలో 66.49 లక్షల మందికి అందనున్న సొమ్ము

తమకు ‘రైతుబంధు’ ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతుబంధు సొమ్మును ప్రభుత్వం బుధవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టింది. తాజా లెక్కల ప్రకారం.. మొత్తం 70.53 లక్షల మంది పట్టాదారులు ఉన్నట్టు సీసీఎల్‌ఏ గుర్తించగా.. అందులో నాలుగు లక్షల మంది రైతులు రైతుబంధుకు దూరమయ్యారు. దీనికి చిన్నచిన్న సమస్యలే కారణమని, గుర్తించి సరిచేయకపోవడం వల్ల ఇబ్బంది నెలకొందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తమకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోయినా రైతుబంధు ఆగిందని, తమకు సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏయే సమస్యలతో..
మొత్తం ఈసారి 4.04 లక్షల మందికి రైతుబంధును నిలిపివేసినట్టు వ్యవసాయశాఖ అంతర్గత నివేదికలో వెల్లడించింది. అందులో 1.78 లక్షల మంది బ్యాంకు వివరాలు లేకపోవడం, 19,494 మందికి బ్యాంకు డీబీటీ వైఫల్యం, 124 మందికి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సమస్యలు ఉన్నాయని.. ఇక ఇతరత్రా స్టాప్‌ పేమెంట్‌ లిస్ట్‌లో ఉన్న 2.07 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధును నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

ఈ స్టాప్‌ పేమెంట్‌ లిస్టులో ధరణి సమస్యలు, కోర్టు కేసులున్న భూములతోపాటు రైతులు చనిపోయిన వారి స్థానంలో వారసులు/ఇతరులు తిరిగి దర ఖాస్తు చేసుకోకపోవడం వంటివి ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనితో నికరంగా 66.49 లక్షల మందికి రైతుబంధు నిధులు జమచేయనున్నారు. గత వానాకాలం సీజన్‌లో 63.99 లక్షల మందికి రైతుబంధు నిధులు అందాయి. మరోవైపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. జనవరి మొదటి వారం వరకు కొత్త దరఖాస్తులను పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి.

రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా..
రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు నిలిచిపోయింది. ఈ జిల్లాలో మొత్తం పట్టాదారులు 3,82,237 మంది ఉండగా, అందులో 61,159 మందికి రైతుబంధు సొమ్ము అందడం లేదు. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3,88,230 మందికిగాను 37,908 మంది రైతుబంధును నిలిపి వేశారు. నల్లగొండ జిల్లాలో 5,18,902 మంది పట్టా దారులు ఉండగా 25,453 మందికి ఆపేశారు.

కాగా ఈనెల 20వ తేదీ వరకు కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చిన 2,47,822 రైతులకు యాసంగి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సదరు రైతులు ఏఈవోను కలిసి దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ ప్రతులను అందజేయాలి. ఏఈవోలు ఆ దరఖాస్తులను, బ్యాంకు వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. రైతులు దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఏఈవోలు నమోదు పూర్తి చేయాలి. ఏఈవో ధ్రువీకరించడంలో ఆలస్యమై, అందుకు సంబంధించి ఫిర్యాదులేమైనా వస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

సమస్యలున్న భూములకు నిలిపేశాం
‘‘రాష్ట్రంలో కొందరికి రైతుబంధు సొమ్ము నిలిపివేసిన మాట వాస్తవమే. కోర్టు కేసులు, వివిధ సంస్థలకు చెందిన భూములు, రైతు బీమా మరణాల కేసులు, ఎన్నారై భూముల కేసులు, గంజాయి సాగు చేస్తున్న భూములకు చెందిన వారికి రైతుబంధు నిలిపివేశాం.
– రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి 
చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top