తగ్గేదేలే.. మోదీ టార్గెట్‌గా మరోసారి సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

CM KCR Comments In Mahabubnagar Public Meeting - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో​ ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్‌ భవనాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం, అక్కడ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. 

కాగా, బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాము. గతంలో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ వచ్చాక పాలమూరు వలసలు తగ్గాయి. వలసపోయిన బిడ్డలంతా తిరిగి వస్తున్నారు. పాలమూరు ఇప్పుడు పచ్చిన పంటల జిల్లాగా అయింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాము. సంక్షేమంలో తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరు. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాము. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదు. తెలంగాణలో కలపాలని కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కోరుతున్నారు. నా తెలంగాణ రైతు కాలర్‌ ఎగరవేసే స్థాయికి చేరాలి.

అసమర్థ కేంద్ర ప్రభుత్వం కారణంగా రూ. 3 లక్షల కోట్లు నష్టపోయాం. కేంద్రం కూడా బాగా పనిచేస్తేనే దేశం బాగుపడుతుంది. మన నీటి వాటా తేల్చడం లేదు. రాష్ట్రానికి వచ్చి మోదీ డంబాచారాలు చెబుతున్నారు. నీటి వాటాలు తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోవా?. దేశంలో ఏం జరుగుతుందో మేధావులు, యువకులు ఆలోచించాలి. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్‌ కోతలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి.  ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా మంచి నీటి సమస్యలు, కరెంట్‌ కోతలున్నాయి. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. మే​ము చేయం.. వాళ్లను చేయనివ్వం అనే విధంగా కేంద్రం తీరు ఉంది. కాళ్లలో కట్టెలు పెడుతా అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనివ్వరా?. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ పెట్టంది.

ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉంది. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుపడతారా?. ప్రశ్నిస్తే మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. చిల్లరగాళ్ల ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏ కారణంతో ప్రభుత్వాలను కూలగొడతారు. దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులు చేయడం సరికాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top