ఇదేం ఎజెండా? | ITDA Governing Council meeting | Sakshi
Sakshi News home page

ఇదేం ఎజెండా?

Jan 29 2016 12:23 AM | Updated on Aug 9 2018 4:45 PM

ఇదేం ఎజెండా? - Sakshi

ఇదేం ఎజెండా?

‘వేసవి సమీపిస్తోంది...గిరిజన ఆవాసాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. వేసిన బోర్లు, పైపులు కూడా

 అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
 ‘మంచినీరు, విద్య’ ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు
 పోడుపై ఫారెస్ట్ అధికారుల  తీరు పట్ల ఆగ్రహం
 పీహెచ్‌సీల్లో మంచినీళ్లు లేవు.. మరుగుదొడ్లు కంపు
 వాడీవేడిగా ఐటీడీఏ  పాలకమండలి సమావేశం
 సమస్యలు చర్చించడమే కాదు.. వెంటనే పరిష్కారం చూపాలి
 దుమ్ముగూడెం రీ డిజైన్‌పై  ప్రజాప్రతినిధులతో  సమావేశం నిర్వహించాలి
 అధికారులకు సూచించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 
 సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వేసవి సమీపిస్తోంది...గిరిజన ఆవాసాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. వేసిన బోర్లు, పైపులు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. కోట్ల రూపాయలతో కొత్త మంచినీటి పథకాలు మంజూరై...నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మరోవైపు  పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో సమస్యలు తీవ్రమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ అంశాలను ఎజెండాలో ఎందుకు పెట్టలేదు’’ అంటూ ప్రజాప్రతినిధులు ఐటీడీఏ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుండాలలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్వహించారు.
 
  ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పలు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరై గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా గత పాలకమండలిలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలు, తీసుకున్న చర్యలపై వివరిస్తుండగానే ఎమ్మెల్యేలు పాయం, సున్నం రాజయ్యలు ఈ సీజన్‌లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యారంగ అభివృద్ధికి తీసుకున్న చర్యలేంటి..?, పోడు భూముల సమస్య తీవ్రమవుతున్నా వీటిని ఎజెండాలో ఎందుకు పెట్టలేదని కలెక్టర్, పీఓలను ప్రశ్నించారు.
 
   ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో ముందుగానే ప్రజాప్రతినిధులు తమ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ని  మంచినీటి సమస్య, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితిపై ప్రస్తావించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మంచినీటి సమస్య, పోడుభూములకు అటవీ హక్కుపత్రాలు, గిరిజనులు ఎదుర్కొం టున్న ఇబ్బందులపైనే చర్చ సాగింది. ఈ సమయంలోనే గతంలో తీసుకున్న చర్యలు కంటితుడుపుగా ఉన్నాయని ఎమ్మెల్యేలు పాయం, సున్నం రాజయ్య లు కలెక్టర్‌కు వివరించారు. సమావేశం ఉందనగానే హడావిడిగా ఏదో ఒక చర్య తీసుకున్నామని నివేదికలో పొందుపరిస్తే ఎలా..? అని వారు  కలెక్టర్‌ను ప్రశ్నించారు.
 
 అధికారులు నిర్లక్ష్యాన్ని వీడకపోతే సంక్షేమ పథకాలు గిరిజనులకు ఎలా అందుతాయన్నారు. ఆ తర్వాత సాయంత్రం 5గంటల వరకు ఎజెండాలో ఉన్న వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు, ఇందిరా క్రాంతి పథం, గృహనిర్మాణ సంస్థ,  ట్రైకార్ అంశాలపై చర్చించారు. ఎజెండాలో పొందుపర్చిన జమాఖర్చులు, పరిపాలనా విభాగపు ఖర్చులు, చార్టర్ అకౌంటెంట్ నివేదిక, 2015-16 వార్షిక బడ్జె ట్ ప్రణాళికను ఆమోదించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆనంద్‌మోహన్, ట్రైనీ ఐఏ ఎస్ ముషారఫ్ ఆలీ ఫారూకీ, డీఆర్‌డీఏ పీడీ మురళీధరరావు, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, ట్రాన్స్ కో ఎస్‌ఈ ధన్‌సింగ్, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, అడిషనల్ డీఎం అండ్‌హెచ్‌ఓ పుల్లయ్య, మలేరియా అధికారి రాంబా బు, సీపీఓ జెడ్.రాందాస్, ఎస్టీ వెల్ఫేర్ సూపరింటెం డెంట్ ఇంజనీర్ టి.మల్లికార్జున్, డీడీఎం శంకర్, ఉపసంచాలకులు జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఏజెన్సీలో మంచినీటి సమస్య, పరిష్కారానికి ఈ వేసవిలో చేస్తున్న ప్రణాళికపై వచ్చేనెల 10లోగా మరో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ చెప్పారు. అటవీ భూములకు హక్కుపత్రాలకు సంబంధించి మరో 4వేలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు పీహెచ్‌సీలకు కూడా మహిళా డాక్టర్లను నియమించాలని కోరుతున్నారని, అయితే వారంలో రెండు రోజుల్లో ప్రాధాన్యత ఉన్న పీహెచ్‌సీలకు మహిళా డాక్టర్లను పంపే చర్యలు తీసుకుంటామన్నారు. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఇంకా 800 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై సర్వేలు జరుగుతున్నాయని, జిల్లాలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సుమారు రూ.23వేల కోట్ల ఖర్చు అవుతుందన్నారు. 2020 నాటికి నిర్మాణం దిశగా అడుగులు పడతాయన్నారు. ఆశ్రమపాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పౌష్టికాహారం అందించాలన్నారు.
 
 గిరిజనులను ఎందుకు వేధిస్తున్నారు..? : ఎంపీ పొంగులేటి
 కొణిజర్ల మండలం సాలెబంజర, జంపన్ననగర్, విక్రమ్‌నగర్‌లో రైతులు పోడుభూముల్లో బోర్లు వేయించుకుంటుంటే అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ఫారెస్ట్ అధికారులను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. వారు సాగు చేసుకుంటున్న భూములకు చట్టబద్ధంగా సహకరించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేస్తారా..? అన్నారు. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉత్పన్నం అవుతోందని, అటవీశాఖ కిందిస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతోనే గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులున్నా ఎజెండాలో ఎందుకు పెట్టలేదని అధికారులను అడిగారు. మలేరియా, ఇతర విష జ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఈ మరణాలే లేవని చెప్పడం దేనికి నిదర్శనమన్నారు.
 
 వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది స్థానికంగా ఉండి వైద్యం అందించాలన్నారు. ఏజెన్సీకి డీఈఓ లేక చాలాకాలం అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి లేదని, వీటిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలు బిల్లుల కోసం కాళ్లరిగేలా హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ లబ్ధిదారులకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో చేయాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ వారు ఇస్తున్న రుణాల్లో రాజకీయ జోక్యం లేకుండా ఎవరి ఒత్తిడికి అధికారులు తలొగ్గకుండా అర్హులకే ఇవ్వాలన్నారు. 108, 104 వాహనాలను మండలాలకు అందుబాటలో ఉండేలా చూడాలన్నారు. 104 వాహనాలు ఈ మధ్య పలు గ్రామాలకు వెళ్లడం లేదని అక్కడి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
 
  దూరం, టార్గెట్లతో సంబంధం లేకుండా ఈ వాహనాలను ప్రజలకు చేరువలో ఉంచినప్పుడే వీటి లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాలక మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మళ్లీ నిర్వహించే సమావేశంలో ఇలా నామమాత్రపు చర్యలు తీసుకున్నట్లు నివేదికల్లో చూపించవద్దని అధికారులకు సూచించారు. దుమ్ముగూడెం రీడిజైన్ చేసిన అంశం, ఏ మండలాలకు నీరు అందుతుంది..? ఏ మండలాలకు నీరు అందడం లేదనే అంశాలపై జిల్లాలోని  ప్రజాప్రతినిధులు అందరితో సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌కు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించే అంశాలను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement