కాయ్‌రాజా కాయ్‌..!

IPL 2019 Betting In Nalgonda District - Sakshi

మ్యాచ్‌ ప్రారంభమైతే చాలు ఆటగాళ్లు..  చూసే ప్రేక్షకుల కంటే హార్ట్‌బిట్‌ ఎక్కువగా పెరిగే మరో వర్గం ఉంది. భరించలేని టెన్షన్‌తో నరాలు తెగిపోయే ఉత్కంఠతో మద్యం, సిగరెట్లు తాగుతూ క్షణ క్షణం ఉత్కంఠంగా భరించలేని టెన్షన్‌లో కొనసాగుతున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. చట్టం ఎంత పకడ్బందీగా ఉన్నా బెట్టింగ్‌ రాయుళ్లలో మార్పు కనిపించడం లేదు. బ్రోకర్ల మాయజాలంలో రాత్రికి రాత్రే లక్షల రూపాయలు ఆన్‌లైన్‌లో చేతులు మారుతున్నాయి. పలు జీవితాలు తలకిందులవుతున్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో బెట్టింగ్‌ ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

సాక్షి, యాదాద్రి : ఐపీఎల్‌–12 క్రికెట్‌ కోట్లు కురిపిస్తున్న వ్యాపార క్రీడా ఇప్పుడు యువత జేబుకు చిల్లుపెడుతోంది. క్రీడాభిమానులు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ట్వంటీ, ట్వంటీ క్రికెట్‌ అంతే స్థాయిలో బెట్టింగ్‌ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతోంది. బెట్టింగ్‌ నేరమని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిసినా యువత అటు వైపు పరుగులు తీస్తోంది. టాస్‌ వేయడానికి ముందు నుంచి ప్రారంభమయ్యే వరకు బెట్టింగ్‌ రాయుళ్లు సెల్‌ఫోన్‌లకు అంకితం అవుతున్నారు. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ అందుబాటులోకి రావడంతో డబ్బు చాలా ఈజీగా చేతులు మారుతోంది.

రూ.500 నుంచి లక్ష వరకు పందెంకాస్తున్నారు. ఒక్క భువనగిరి పట్టణంలో ప్రతి రోజు రూ.20 లక్షల వరకు బెట్టింగ్‌ జరుగుతుందంటే జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు బెట్టింగ్‌ జరుగుతోందని అంచనా. బెట్టింగ్‌ డబ్బుల కోసం ఇల్లు, ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలు, బైక్‌లు ఇలా అదీ ఇది అని కాకుండా అన్నింటినీ వాడుకుంటున్నారు. అయితే బెట్టింగ్‌లో లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారు.

మ్యాచ్‌ ప్రారంభ కావడానికి  ముందు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో భువనగిరిలోనే ఉన్న 10మందికిపైగా బ్రోకర్ల ద్వారా ఈ దందా సాగుతోంది. ఈబెట్టింగ్‌ మ్యాచ్‌ పూర్తి అయ్యే వరకు సాగుతోంది.  గత సంవత్సరం  భువనగిరిలో ఎస్‌ఓటీ పోలీసులు బెట్టింగ్‌ రాయుళ్లను పట్టుకున్నారు.  అయితే పట్టణాల నుంచి పల్లెల వరకు బెట్టింగ్‌ వ్యసనం యువతతోపాటు అన్ని వయస్సుల అక్షరాస్యులు. నిరక్ష్యరాస్యులను  పట్టి పీడిస్తోంది.

బెట్టింగ్‌లే బెట్టింగ్‌లు
ట్వంటీ ట్వంటీ క్రికెట్‌ జరుగుతున్న తరుణంలో జిల్లాలో బెట్టింగ్‌ జోరుగా పెరిగిపోతోంది. బెట్టింగ్‌పై పోలీస్‌ నిఘా పెట్టినప్పటికి యువత బెట్టింగ్‌ మత్తులో మునిగి తేలుతున్నారు. విద్యార్థులు ఈ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్‌ అన్ని మండలాల్లో  బెట్టింగ్‌ దందా కొనసాగుతోంది. ఐపీఎల్‌ లీగ్‌ టోర్నమెంట్‌ మధ్యలోకి చేరుకోవడంతో బెట్టింగ్‌లు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి.  అయితే ట్వంటీ ట్వంటి మ్యాచ్‌కు సంబంధించి టాస్‌తోనే  బెట్టింగ్‌ దందా ప్రారంభం అవుతోంది. ఫెవరేట్‌ జట్టుకు నాన్‌ఫెవరేట్‌ జట్ల పేరుతో బెట్టింగ్‌కు దిగుతున్నారు.

బెంగళూరు రాయల్‌ చాలెంజర్‌ జట్టు ఫెవరేట్‌గా బెట్టింగ్‌ కట్టి లక్షలాది రూపాయలు నష్టపోయారని సమాచారం. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన చాలెంజర్స్‌ ఆరోమ్యాచ్‌లో ఢిల్లీపై అలవోకగా గెలుస్తారని ఫెవరేట్‌ జట్టుగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌ కట్టారు. విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌పై నమ్మకంతో బెట్టింగ్‌ రాయుళ్లు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆరో మ్యాచ్‌ కూడా ఓడిపోవడంతో భారీగా నష్టపోయారు. అయితే మ్యాచ్‌ జరుగుతున్నంత సమయంలో రన్‌లు సింగిల్, డబుల్, ఫోర్, సిక్స్, రనౌట్, స్టంపింగ్‌ ఇలా అన్ని కోణాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు బెట్టింగ్‌ తారా స్థాయికి చేరి బెట్టింగ్‌ రాయుళ్లు ఎంత మొత్తంలోనైనా బెట్టింగ్‌లో పెట్టడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే  భువనగిరి, యాదగిరిగుట్టల్లో పలువురు బెట్టింగ్‌లో లక్షలు నష్టపోయారు. బెట్టింగ్‌ కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడుతున్నారు.

ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌ తెలిస్తే చాలు ఆన్‌లైన్‌లో బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ బెట్టింగ్‌ పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లో బుకీలు తెలివిగా వారికి సంబంధం లేకుండా మరో వ్యక్తుల అకౌంట్లలోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఫోన్‌పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. ఈమ్యాచ్‌లకు బెట్టింగ్‌లో జమ చేసిన డబ్బులు మరుసటి రోజు తీసుకుంటారు.  యాప్‌ల ద్వారా సులభంగా డబ్బులను బదిలీ చేస్తున్నారు. ఫెవరేట్‌–నాన్‌ ఫెవరేట్‌ పేరుతో రెండు జట్లపై బెట్టింగ్‌కు రూ.500 నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇరు జట్ల కెప్టెన్‌లు టాస్‌ వేయడానికి వచ్చినప్పటి నుంచి బెట్టింగ్‌ ప్రారంభం అవుతోంది. బాల్‌ బాల్‌కు, ఓవర్‌ ఓవర్‌ నుంచి లాస్ట్‌ బాల్‌ వరకు బెట్టింగ్‌ నిరంతరాయంగా సాగుతుంది.

ఫెవరేట్‌ జట్టు గెలిస్తే తక్కువ మొత్తం, నాన్‌ ఫెవరేట్‌ జట్టు గెలిస్తే ఎక్కువ మొత్తం డబ్బు చేతికందుతుంది. 1:2, 1:4, 1:6 వరకు బెట్టింగ్‌ చేస్తున్నారు. ఒక్క పరుగు, రెండుపరుగులు, నాలుగు పరుగులు, ఆరుపరుగులు ఇలా పరుగు పరుగుకు బెట్టింగ్‌ నడుస్తోంది. బిట్‌త్రీ సిక్స్‌టీఫై, డ్రీమ్‌లెవెన్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జరిగే వెబ్‌సైట్‌లు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు  అన్ని మండలాల్లో  బెట్టింగ్‌ దందా విశృంఖలంగా తన పడగ విప్పి  బుసలుకొడుతోంది. బెట్టింగ్‌తోపాటు పందేలు కాస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక బెట్టింగ్‌లతోపాటు ముంబయి, హైదరాబాద్‌ కేంద్రంగా బెట్టింగ్‌ జోరందుకుంది. ఇంజనీరింగ్‌ ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థుల బెట్టింగ్‌ కోసం తమ వాహనాలను, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌లు, ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తాకట్టు పెట్టి బెట్టింగ్‌ కడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top