కోవిడ్‌పై రంగంలోకి ఐబీ!

Intelligence Bureau Making Action Plan To Control Of Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌ నియంత్రణకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) రంగంలోకి దిగింది. విదేశాల నుంచి వచ్చినవారిని వెతికి పట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కొందరు విదేశాల నుంచి వచ్చి కూడా తమ వివరాలు బయటకు వెల్లడి కాకుండా చూసుకోవడం.. వైద్య, ఆరోగ్యశాఖకు వెల్లడించకపోవడంతో ప్రభుత్వం ఐబీ సహకారం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలతో ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. అయితే ఆ సమావేశ వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఇంటెలి జెన్స్‌ బృందాలు విదేశాల నుంచి వచ్చిన 18 వేల మంది వివరాలను సేకరించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్‌లను గుర్తించాయి. ఇంకా ఎవరెవరు అందుబాటులో లేకుండా ఉన్నారన్న దాని పైనా ఇంటెలిజెన్స్‌ వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి జాబితా తీసుకొని వారిని గుర్తిస్తున్నాయి. గత 3 రోజుల్లోనే యూకే నుంచి ఏకంగా 100 మంది వచ్చారని ఒక ఇంటెలిజెన్స్‌ అధికారి తెలిపారు. 

సెక్రటేరియట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌
ఇప్పటివరకు వైద్య, ఆరోగ్యశాఖ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లో కమాండ్‌ కం ట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి ఆ శాఖ అధికారులతో పర్యవేక్షణ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యాధికారులతో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దీనిపైనే దృష్టిసారించడం, రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటించడంతో ఇక అన్ని శాఖలను పర్యవేక్షించేందుకు సచివాలయంలో సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీన్ని జీఏడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులతో పర్యవేక్షణ చేస్తారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ తరఫున కొందరు అధికారులతోపాటు నలుగురు వైద్యులను నియమిస్తారు. అన్ని శాఖల తరఫున షిఫ్టుల ప్రకారం అధికారులు విధులు నిర్వహిస్తారు. అయితే ఇది సాధారణ బాధితులకు అందుబాటులో ఉండదు. కోవిడ్‌ బాధితులు తమ వివరాలు, సందేహాలు, సమాచారం కోసం ‘104’నంబర్‌కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పుడు నిర్వహిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూం యథావిధిగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. 

‘తెలంగాణ కోవిడ్‌ యాప్‌’ప్రారంభం...
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఈ యాప్‌ను ఎలా వినియోగించాలన్న దానిపై కలెక్టర్లకు ప్రజారోగ్య సంచాలకులు లేఖ రాశారు. ఎలాంటి సమాచారం పంపాలన్న దానిపైనా వారికి మార్గదర్శకాలిచ్చారు. గ్రామాలవారీగా ఉండే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారు, అనుమానిత కేసులు, కోవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. రాష్ట్రంలో 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది, 31 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలుంటారు. వారిలో చాలామంది వద్ద ట్యాబ్‌లున్నాయి. ట్యాబ్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. వారంతా ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే చేపడతారు. ఆ సర్వే వివరాలను ప్రతీ రోజూ వారు తమ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది విదేశాల నుంచి వచ్చారు? ఎందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు? ఎందరు అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నారన్న సమాచారాన్ని వారు సేకరిస్తారు. అంతేగాక ఎంతమంది రిస్క్‌లో ఉన్నారు? ఎంతమందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు? వంటి వివరాలను సేకరిస్తారు. ఆయా వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశాక దాన్ని గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారు. అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలిస్తారు. మున్ముందు ఈ యాప్‌ను మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎవరైనా కోవిడ్‌ బాధితులు తమ వివరాలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే వారి వద్దకు వైద్య సిబ్బందిని పంపిస్తారు. అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఇళ్ల సమీపంలో 150 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి.

300మందితో ఇండోనేసియన్ల బృందం కాంటాక్ట్‌...
మత ప్రచారం కోసం ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది బృందం కరీంనగర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వారందరికీ కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయమూ విదితమే. వారు ఈ రాష్ట్రంలో దాదాపు 300 మందితో కాంటాక్ట్‌ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అత్యంత సన్నిహితంగా 37 మందితో మెలిగారు. వీరందరినీ వైద్య పర్యవేక్షణలోనూ, క్వారంటైన్‌లోనూ ఉంచారు. 

పోలీసుశాఖ, వైద్య ఆరోగ్యశాఖ మధ్య సమన్వయం...
విదేశాల నుంచి వచ్చేవారు తమకు అందకుండా తిరుగుతున్నారని భావించిన వైద్య, ఆరోగ్యశాఖ పోలీసుశాఖ సాయం కోరింది. సోమవారం పోలీసుశాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా అన్ని శాఖలతోనూ సమన్వయం కోసం సుదీర్ఘంగా ఫోన్‌లో చర్చించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా హోం క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య : 12,486
కోవిడ్‌ ఉన్నవారితో కాంటాక్ట్‌ అయినట్లు నిర్దారణ అయినవారు : 456
రాష్ట్రంలో రెడీగా ఉన్న ఐసోలేషన్‌ సెంటర్లు : 130 
వీటిలో మొత్తం పడకల సంఖ్య : 32,500

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top