సింగరేణికి ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీ అవార్డు

Indias Best Company Award to Singareni - Sakshi

మార్చి 8న ముంబైలో అవార్డు ప్రదానం

గోదావరిఖని: అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు 2018 సంవత్సరానికి ఇచ్చే ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డును 2019, మార్చి 8న ముంబైలో ప్రదానం చేయనున్నారు. అవార్డు స్వీకరణకు రావాల్సిందిగా సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ను బెర్క్‌ఫైర్‌ మీడియా సీఈవో హేమంత్‌కౌశిక్, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎమిలీవాల్ష్ ఆహ్వానం పంపించారు. బెర్క్‌ఫైర్‌ సంస్థవారు ఏటా దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీగా ఎంపిక చేసి అవార్డును బహూకరిస్తున్నారు.

అద్భుత ప్రగతికి విశిష్ట పురస్కారాలు 
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సారథ్యంలో వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంది. కంపెనీ సాధిస్తున్న ప్రగతికి గుర్తింపుగా ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కంపెనీ పొందింది. వీటిలో ఆసియా పసిఫిక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ అవార్డు, అవుట్‌ స్టాండింగ్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు, బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు, ఆసియాస్‌ మోస్ట్‌ ట్రస్టెడ్‌ కంపెనీ అవార్డు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌పర్ఫార్మెన్స్‌ అవార్డు, బెస్ట్‌ సేవా అవార్డు వంటివి 2018 సంవత్సరంలో సాధించినవాటిలో ఉన్నాయి.

సమష్టి కృషికి గుర్తింపు: సీఎండీ శ్రీధర్‌ 
ఇండియాస్‌ బెస్ట్‌ కంపెనీ–2018 అవార్డుకు సింగరేణి ఎంపిక కావడంపై సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతూ అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటోందని, అలాగే తమ సంస్థ కూడా ఆయన మార్గదర్శకత్వంలో సింగరేణీయుల సమష్టి కృషితో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతోందన్నారు. ఈ అవార్డు సంస్థలోని సింగరేణీయుల అందరి సమష్టి కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top