65కు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ

Increasing the retirement age of teaching doctors - Sakshi

బోధనాసుపత్రుల వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు

వ్యతిరేకించిన జూడాలను బుజ్జగించిన మంత్రి ఈటల

ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జూడా నేతలు

విరమణ వయసు పెంపును వైద్యులందరికీ వర్తింపచేయాలన్న వైద్యుల సంఘం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గవర్నర్‌ నరసింహన్‌ ఆర్డినెన్స్‌ జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విరమణ వయసును పెంచాలని అప్పట్లో మంత్రి మండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రావడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికలు, అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు... ఇలా ఎలక్షన్‌ కోడ్‌తో ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ప్రభుత్వ దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, వైద్యులకు కూడా విరమణ వయస్సు 65ను అమలుచేస్తారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని గవర్నర్‌ విడుదల చేసిన రాజపత్రంలో పేర్కొన్నారు.

బోధనాసుపత్రుల్లో పలువురి ఉద్యోగ విరమణ వల్ల అనేక ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయకపోవడంతో వైద్య విద్య ఇబ్బందుల్లో పడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సకాలంలో పదోన్నతులు జరపకపోవడం వల్ల కూడా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కేడర్‌లోని సీనియర్‌ బోధనా సిబ్బందిలో భారీగా తగ్గుదల కనిపిస్తుందని ఆర్డినెన్స్‌లో వివరించారు. అంతేకాదు సూపర్‌ స్పెషాలిటీల్లోని కొన్ని యూనిట్లలో బోధనా సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా ఉందని, ఫలితంగా కొన్ని విభాగాలు దాదాపు మూసివేత అంచునకు చేరిన పరిస్థితి నెలకొందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బోధనా సిబ్బంది కొరతతో భారతీయ వైద్య మండలి, భారతీయ దంత వైద్య మండలీలు తనిఖీలకు వచ్చినప్పుడు పీజీ సీట్లతో సహా కొన్ని మెడికల్‌ కాలేజీల్లో ప్రస్తుతమున్న సీట్ల గుర్తింపునూ కోల్పోయే పరిస్థితి ఉందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచామని వివరించారు. రాష్ట్ర శాసనమండలి ఇప్పుడు సమావేశంలో లేనందువల్ల వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున ఆర్డినెన్స్‌ జారీచేస్తున్నట్లు వివరించారు. 

జూడాల సమ్మె విరమణ... 
బోధనాసుపత్రుల్లో విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్ల (జూడా)తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జూడాల నేతలు డాక్టర్‌ విజయేందర్, డాక్టర్‌ శ్రీనివాస్, డాక్టర్‌ మహేశ్, నరేష్, లోహిత్‌ తదితరులున్నారు. మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని బోధనాసుపత్రుల్లోని ఖాళీలను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా భర్తీ చేస్తామని, నల్లగొండ, సూర్యాపేట మెడికల్‌ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీని నిలిపివేసి రెగ్యులర్‌గా నియమిస్తామని తమకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. ఖాళీలను మెడికల్‌ బోర్డు నేతృత్వంలో భర్తీ చేస్తామన్నారని తెలిపారు.

విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ రావడంతో దానిపై సమ్మె కొనసాగించినా సర్కారు వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో జూడాలు సమ్మె విరమించారు. ఇదిలావుండగా విరమణ వయసును ఏకంగా ఏడేళ్లు పెంచడంతో బోధనాసుపత్రుల్లోని అనేక మంది వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్యం) ప్రధాన కార్యదర్శి లాలూప్రసాద్‌ సహా పలువురు నేతలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి హర్షం వెలిబుచ్చారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే నిర్ణీతకాల పదోన్నతులు తమకు కూడా కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top