చట్టమున్నా.. చట్టుబండలే!

Increasing attacks on older persons - Sakshi

వృద్ధులపై పెరుగుతున్న దాడులు  

సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రత్యేక చట్టం ఉన్నా.. పట్టింపులేని ప్రభుత్వ విభాగాలు 

కేసుల దర్యాప్తులోనూ కనిపించని పురోగతి 

మూడేళ్లుగా 2,012 కేసులు పెండింగ్‌లో..  ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నవారేకాక, పదవీ విరమణ తర్వాత ఇంటి పట్టునే ఉంటున్న వృద్ధులు పలు రకాల మోసాలు, దాడులకు గురవుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిఘటించే శక్తిలేక నిస్సహాయ స్థితిలో ఉండే పండుటాకులు సులభంగా దాడులకు గురవుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ‘క్రైమ్‌ ఇన్‌ ఇండి యా’ నివేదికలో సీనియర్‌ సిటిజన్స్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను పొందుపరిచింది. ఏటా వృద్ధులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోనూ మూడేళ్లుగా వృద్ధులపై జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.  

పెరుగుతున్న దాడులు..
రాష్ట్రంలో 2014 సంవత్సరానికి సంబంధించి సీనియర్‌ సిటిజన్స్‌పై జరిగిన దాడులు, మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన ఘటనలపై 422 కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ కేసుల సంఖ్య 1,519కి చేరింది. అంటే దాదాపు 200 శాతం దాటిపోయింది. 2016 సంవత్సరంలో 1,382 కేసులు నమోదయినట్టు నివేదికలో తెలిపింది.

2011లో ప్రత్యేక చట్టం.. 
సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011లోనే అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్, సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ (2011) కింద ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎంత మంది సీనియర్‌ సిటిజన్లున్నారు? వారు నివసిస్తున్న ప్రాంతం, వారికి సహాయకులుగా ఉంటున్న వారెవరు? తదితర వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో పొందుపరచాలి. అలాగే స్థానిక కాలనీల అసోసియేషన్ల ఆధ్వర్యంలో యువకుల సహాయంతో వాలంటీర్‌ కమిటీని ఏర్పాటుచేసి సీనియర్‌ సిటిజన్లకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఒక ప్రభుత్వ అధికారి, యూనిఫాం సర్వీస్‌లో పనిచేసి రిటైర్‌ అయిన అధికారి ఉండేలా చర్యలు చేపట్టాలి.

సీనియర్‌ సిటిజన్స్‌ ఎలాంటి ఫిర్యాదుచేసినా వారి ఇంటికి వెళ్లి వివరాలు తీసుకొని న్యాయం చేసేందుకు కృషిచేయాలని ఆ చట్టంలో పొందుపరిచారు. అసలు ఈ చట్ట ప్రకారం ఎన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు ఇలాంటి చట్టం ఉందన్న విషయం కూడా చాలా మంది తెలియదని సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్లు ఇటీవల డీజీపీని కలసి తమ ఆందోళనను తెలిపాయి. పోలీసు శాఖతోపాటు, వివిధ ప్రభుత్వ విభాగాలు తమ సమస్యలపై తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ల ప్రతినిధులు కోరుతున్నారు.

పెండింగ్‌లో 2,012 కేసులు.. 
మూడేళ్లుగా సీనియర్‌ సిటిజన్స్‌పై జరిగిన దాడులు, మోసాలు, తదితర కేసుల్లో పోలీస్‌ శాఖ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మూడేళ్లలో 2,012 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. వృద్ధులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వారిని గుర్తించి కూడా అరెస్ట్‌ చేయని సంఘటనలు చాలా ఉన్నాయని సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాగే హత్య వంటి తీవ్రమైన కేసుల్లోనూ తాము డీజీపీ, హోంశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి కేసులు వేస్తే తప్ప న్యాయం జరగడం లేదని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేశాయి. జీవితంలో చివరి మజిలీలో ఉన్న తమ రక్షణకు ప్రత్యేకమైన చట్టం ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top