
డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వ్యాఖ్యలపై పోలీసు శాఖ విస్మయం
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో 199 మందికి వీఆర్
పాలకుల వేధింపులకు గుప్తా బహిరంగ సమర్థనపై మండిపాటు
అత్యున్నతాధికారే నైతిక మద్దతు ఇవ్వకపోవడంపై ఆవేదన
సాక్షి, అమరావతి: ‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండటం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్ పోస్టే’ అని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వీఆర్‌లో ఉండటం కూడా పోస్టింగే అయితే... మరి జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలతో దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో భారీగా ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని అత్యున్నతాధికారి అయిన డీజీపీ గుప్తా బహిరంగంగా సమరి్థంచడంపై మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ గుప్తా వ్యాఖ్యలు ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి.
వేధించడం ఏవిధంగా సమర్థనీయం డీజీపీ..!?
పోలీసుల సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ గుప్తా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రను వెనకేసుకురావడంపై పోలీసువర్గాలు గళం విప్పుతున్నాయి. వీఆర్ శాంక్షన్ పోస్టే అయితే వారికి ప్రతినెలా జీతం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఐదు నెలల్లో అయినా వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు జీతాలు చెల్లించారా.. అని సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాయి.
ప్రభుత్వంలో ఏ ఇతర శాఖలో లేని రీతిలో భారీ సంఖ్యలో అధికారులను వెయిటింగ్లో ఉంచడం, జీతాలు చెల్లించకుండా వేధించడం ఏవిధంగా సమర్థనీయమో డీజీపీ గుప్తానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారిన డీజీపీ కనీసం ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా ఉండాల్సిందని, పోలీసులు కీలు బొమ్మలు కాదని అభిప్రాయపడుతున్నాయి. వీఆర్‌లో పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పించే బాధ్యత తీసుకోలేకపోయినా కనీసం వారికి నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం డీజీపీ స్థాయి అధికారికి తగదని విమర్శిస్తున్నాయి.
199 మంది పోలీసు అధికారులకు వీఆర్!
దేశ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో వేధింపులు గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం మీద 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంఖ్యలో పోలీసు అధికారులను వీఆర్‌లో ఉంచలేదు.
నెలల తరబడి పోలీసు అధికారులను అవమానానికి గురి చేసింది. వారికి జీతాలు చెల్లింపు నిలిపివేసింది. అంతే కాదు వీఆర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాలని, వెయిటింగ్ హాల్లో రోజంతా నిరీక్షించి సాయంత్రం 5 గంటలకు సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం విభ్రాంతి కలిగించింది.
ఇప్పటికీ ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామ్‌రెడ్డి, వై.రవిశంకర్‌రెడ్డి, పి.జాషువా, వై.రిషాంత్ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వీఆర్‌లోనే ఉన్నారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం వీఆర్‌లో ఉంచొద్దని రాజస్థాన్ హైకోర్టు కూడా ఇటీవల తీర్పు/నిచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది.