
కూటమి కుట్రలను పటాపంచలు చేస్తూ తరలి వచ్చిన జనం
ఎస్పీలు.. డీఎస్పీలు.. ఏఎస్పీలు.. 2 వేల మందికిపైగా పోలీసుల కవాతు..! అదేమీ ఉగ్రవాద కల్లోలిత ప్రాంతం కాదు..! తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ బందోబస్తు అంతకంటే కాదు..! ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మించి పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించింది. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అణచివేతలకు పాల్పడింది. బంగారుపాళ్యంలో వేల సంఖ్యలో ఖాకీలను మోహరించింది. రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమానికి రైతులెవరూ రాకూడదంటూ.. రౌడీషీట్లు తెరుస్తామంటూ నిర్భందాలకు తెగబడింది! ఈ సర్కారు ఎన్ని చేసినా.. ఎన్ని కుట్రలకు తెగించినా.. ఎటుచూసినా విరగకాసిన మామిడిలా జనమే.. జనం!!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా, పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా.. తుదకు వైఎస్ జగన్‌పై ఉన్న జనాభిమానాన్ని అడ్డుకోలేకపోయింది. ఊరికొక చెక్ పోస్ట్.. బంగారుపాళ్యం చుట్టూ బారికేడ్లు.. వాటి వద్ద వందల మంది పోలీసుల మోహరింపు.. జగన్ పర్యటనకు రావొద్దని రైతులకు బెదిరింపులు.. రౌడీషీట్ తెరుస్తామని నాయకులకు నోటీసులు.. రోడ్డుపై ఆటో.. ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేస్తామనే హెచ్చరికలు.. ఇలా అడుగడుగునా ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. అయినా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై కాలు మోపగానే జనసంద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది.

వేలాది మంది రైతులు బంగారుపాళ్యం వైపు పరుగులు తీశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను, పోలీసుల లాఠీ దెబ్బలను దాటుకుని అభిమాన నేత చెంతకు చేరారు. తమ కష్టాలను వివరించారు. నేనున్నాను.. అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో గుండెల్లో భారం దిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. డీఐజీ, ముగ్గురు ఎస్పీల పర్యవేక్షణలో సుమారు 2000 మందికిపైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపింది. రెండు రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యారు.
జన సంద్రమైన మార్కెట్ యార్డు
ప్రభుత్వ అధికార యంత్రాంగం జనాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. జనం మాత్రం ఆగలేదు. ఎక్కడైతే వాహనాలను ఆపి వెనక్కు పంపేశారో.. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టల మీదుగా వైఎస్ జగన్ పర్యటించే రహదారి సమీపంలోని మామిడి తోటల్లో వేచి ఉన్నారు. వైఎస్ జగన్ అక్కడికి రాగానే ఒక్కసారిగా రహదారిపైకి దూసుకురావటం కనిపించింది.
కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి కొత్తపల్లి బ్రిడ్జి వరకు, తుమ్మేజిపల్లి, నలగాంపల్లి క్రాస్, దండువారిపల్లి, మాధవనగర్, ముంగరమడుగు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్డుపైకి చేరుకుని వైఎస్ జగన్‌కు జైకొట్టారు. వారిని గమనించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌ని ఆపి వారితో ఆప్యాయంగా మాట్లాడి ముందుకు కదిలారు. కొత్తపల్లి నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వరకు 5 కి.మీ దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం పోటెత్తిందో ఇట్టే తెలుస్తోంది.
ఏకంగా 25 చెక్‌పోస్టులు
వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే వారిని నిలువరించేందుకు తిరుపతి– చిత్తూరు, పలమనేరు మార్గంలో బంగారుపాళ్యం చుట్టుపక్కల ఉన్న అన్ని మార్గాల్లో ఏకంగా 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాలను గాదంకి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చెక్ చేసి పంపటం ప్రారంభించారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు, పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు చెక్ చేయటం కనిపించింది. రైతులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు.

వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారెవరైనా బంగారుపాళ్యం టికెట్ తీసుకుని ఉంటే.. అటువంటి వారు అక్కడ దిగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిజంగా బంగారుపాళ్యం వాసులైనా వారిని అక్కడ దిగనివ్వలేదు. అటు చిత్తూరు, ఇటు పలమనేరుకు పంపించేశారని పలువురు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు స్థానికులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా కూడా వారిని కూడా ఆపి చెక్‌చేసి వెనక్కు పంపే పనిలో నిమగ్నమయ్యారు.

వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌కు వచ్చే సమయానికి యార్డులో రైతులు, మామిడి కాయలు లేకుండా బలవంతంగా తరలించేశారు. పోలీసులే వాహనాలను ఏర్పాటు చేసి మామిడి కాయలను తరలించటం కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ యార్డు మెయిన్ గేటుకు తాళం వేశారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లను సైతం సీజ్ చేశారు.