సర్కారు తీరుపై డీజీల గుస్సా | Rebellion of senior IPS officers | Sakshi
Sakshi News home page

సర్కారు తీరుపై డీజీల గుస్సా

Jul 12 2025 5:58 AM | Updated on Jul 12 2025 5:58 AM

Rebellion of senior IPS officers

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల తిరుగుబాటు బావుటా! 

డీజీపీ గుప్తా ఒంటెత్తు పోకడలపై తీవ్ర ఆగ్రహం 

ప్రభుత్వ పెద్దలను అడ్డుపెట్టుకుని అన్నింటా ‘కీ’లకం 

అందరి అవకాశాలకు గండి కొట్టడంపై విస్తృత చర్చ 

విజిలెన్స్‌ డీజీ పోస్టును డీజీపీ అట్టిపెట్టుకోవడంపై అభ్యంతరం 

కీలక విజిలెన్స్‌ విభాగాలు గుప్పిట పట్టిన డీజీపీ 

సీఐడీ, ఫైర్‌ విభాగాలు జూనియర్‌ అధికారులకు కట్టబెట్టే యోచన 

ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోస్టులో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా  

తమను డమ్మీలను చేయడంపై డీజీల మండిపాటు.. కీలక విభాగాల్లో డీజీ స్థాయి అధికారులను నియమించాలని డిమాండ్‌ 

లెవెల్‌ 17 పే స్కేల్‌ కోసం న్యాయ పోరాటానికి సన్నద్ధం 

డీజీపీ కార్యాలయంలో పోస్టులు వద్దంటూ తేల్చి చెబుతున్న వైనం 

సాక్షి, అమరావతి: క్రమశిక్షణకు మారుపేరుగా భావించే పోలీసు శాఖలో ముసలం పుట్టింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులే చంద్రబాబు ప్రభుత్వ ఒంటెత్తు పోకడలపై తిరుగుబాటు బావుటా ఎగుర వేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు దీనికి నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను రెగ్యులర్‌ డీజీపీగా నియమించడంతో పోలీసు శాఖలో అసంతృప్తి భగ్గుమంది. దాంతో ప్రస్తుతం డీజీ స్థాయి అధికారులు నలుగురుతో పాటు తర్వాత బ్యాచ్‌లకు చెందిన మరో నలుగురు అధికారులకు డీజీపీ పోస్టు దక్కకుండా పోయింది. 

ఇక పోలీసు శాఖలో కీలక విభాగాలకు ఇన్‌చార్‌్జగా ఐజీ స్థాయి అధికారులను నియమించి, వాటని్నంటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న డీజీపీ గుప్తా ఎత్తుగడ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల అసంతృప్తికి ఆజ్యం పోసింది. రెడ్‌బుక్‌ కుట్రను అమలు చేస్తున్నందుకే డీజీపీ గుప్తా నియంతృత్వ పోకడలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ వత్తాసు పలుకుతున్నారని యావత్‌ పోలీసు శాఖ ఆగ్రహంతో రగిలి పోతోంది. ఈ పరిణామాలతో డీజీ స్థాయి అధికారులు ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహిస్తుండటం బట్టబయలైంది. లెవల్‌ 17 పే స్కేల్‌ కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించడం పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.  

రెడ్‌బుక్‌ కుట్ర కోసం గుప్తాకు వత్తాసు 
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను నియమించడంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైరవ్వాల్సిన హరీశ్‌ కుమార్‌ గుప్తా (1992 బ్యాచ్‌)ను అంతకు రెండు నెలల ముందు రెగ్యులర్‌ డీజీపీగా నియమించడమే అందుకు కారణం. దాంతో గుప్తా మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగేందుకు అవకాశం లభించింది. ఆయన కంటే సీనియర్లు అయిన అంజనీ కుమార్‌ (1990 బ్యాచ్‌), మాదిరెడ్డి ప్రతాప్‌ (1991) డీజీపీ అయ్యే అవకాశం కోల్పోయారు. 

పైగా 1993 బ్యాచ్‌కు చెందిన మహేశ్‌ దీక్షిత్, అమిత్‌ గార్‌్గ­లకు కూడా డీజీపీగా అవకాశం లేదని స్పష్టమైపోయింది. 1994 బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్‌ అయ్యన్నార్, కుమార్‌ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలాకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 1995 బ్యాచ్‌కు చెందిన అతుల్‌సింగ్, 1996 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ కుమార్‌ మీనా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేవలం తాము చెప్పినట్టుగా రెడ్‌బుక్‌ కుట్రలను అమలు చేస్తారనే ఉద్దేశంతోనే చివరి నిమిషంలో నిబంధనలకు విరుద్ధంగా హరీశ్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించడంతో ఇంత మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అవకాశాలను కోల్పోయారు.

డీజీలను డమ్మీలు చేస్తున్న డీజీపీ 
డీజీపీ పోస్టు దక్కకపోయినా పోలీసు శాఖలో గౌరవం అయినా ఉందా అంటే అదీ లేకపోవడంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ప్రస్తుతం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) హోదాతో ఉన్న వారిలో నళినీ ప్రభాత్, మహేశ్‌ దీక్షిత్, అమిత్‌ గార్గ్‌ కేంద్ర సర్వీసులో ఉన్నారు. కానీ రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్‌ అయ్యన్నార్, కుమార్‌ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలా, అతుల్‌సింగ్, రాజీవ్‌ కుమార్‌ మీనా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

వారికి పోలీసు శాఖలో కనీస గౌరవం లభించడం లేదు. ఇప్పటికే డీజీపీ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న ఆర్టీసీ ఎండీ పదవిలో రిటైర్డ్‌ డీజీపీ సీహెచ్‌. ద్వారకా తిరుమల రావును  నియమించారు. దాంతో రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు ఓ అవకాశాన్ని కోల్పోయారు. మరోవైపు హరీశ్‌ కుమార్‌ గుప్తా కీలక పోలీసు విభాగాలను తన గుప్పిట్లోనే పెట్టుకోవాలని భావిస్తుండటం వారికి తీవ్ర అవమానకరంగా మారింది. కీలకమైన విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్న గుప్తా.. తర్వాత రెగ్యులర్‌ డీజీపీగా నియమితులయ్యారు. దాంతో మరో డీజీ స్థాయి ఐపీఎస్‌ అధికారిని ఆ విభాగం డీజీగా నియమించాలి. 

కానీ ఇప్పటి వరకు గుప్తానే ఆ విభాగం చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఒక ఐజీ స్థాయి అధికారిని విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చీఫ్‌గా నియమించి, ఆ విభాగాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్నది గుప్తా ఆలోచన అని తెలుస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న మనీశ్‌ కుమార్‌ సిన్హా పేరును ఇందుకోసం పరిశీలిస్తున్నారు. తద్వారా డీజీ స్థాయి అధికారికి దక్కాల్సిన కీలక పోస్టు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డీజీ స్థాయి ఐపీఎస్‌ అధికారులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో ఏ డీజీపీ ఇలా చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు.

అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ కన్ను
ప్రస్తుతం కేంద్ర నిధులు ఎక్కువగా ఉన్న అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ గుప్తా కన్ను పడింది. ఆ విభాగం డీజీగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ను మరో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసి, ఐజీ శ్రీకాంత్‌ను నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకు హోమ్‌ మంత్రి అనిత ద్వారా సిఫార్సు చేయిస్తున్నారని పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. తద్వారా అగ్ని మాపక, పోలీసు టెక్నికల్‌ సర్వీసెస్‌ విభాగాలు కూడా డీజీపీ గుప్తా గుప్పిట్లోనే ఉంటాయి. 

నిబంధనల ప్రకారం సీఐడీ చీఫ్‌ ఆ విభాగాన్ని స్వతంత్రంగా నిర్వహించాలి. రోజువారీ వ్యవహారాల్లో డీజీపీ జోక్యం చేసుకోకూడదు. కానీ అందుకు విరుద్ధంగా సీఐడీ విభాగాన్ని డీజీపీ గుప్తానే స్వయంగా సమీక్షిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వీర విధేయ అధికారి, విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబును సిట్‌ చీఫ్‌గా నియమించి సీఐడీ విభాగాన్ని గుప్తా గుప్పిట్లో పెట్టుకున్నారు. 

విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్ని మాపక, సీఐడీ, ఏసీబీ విభాగాల చీఫ్‌లుగా జూనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నియమించేలా బదిలీల ప్రతిపాదనలను ప్రభుత్వానికి డీజీపీ గుప్తా సమర్పించినట్టు తెలుస్తోంది. తద్వారా కీలకమైన ఆ  విభాగాలన్నీ పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుని డీజీ స్థాయి అధికారులను డమ్మీలను చేయాలన్నది డీజీపీ గుప్తా ఎత్తుగడ అని ఇట్టే అర్థమవుతోంది.

రెండు డిమాండ్లను లేవనెత్తుతున్న డీజీలు
» పోలీసు శాఖలో తమకు జరుగుతున్న అవమానాలపై డీజీ స్థాయి అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పలువురు డీజీ స్థాయి అధికారులు ఇటీవల తరచూ డిన్నర్‌ సమావేశాల్లో తమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారు ప్రధానంగా రెండు డిమాండ్లను లేవనెత్తుతున్నారు.

» ‘విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్నిమాపక, సీఐడీ విభాగాల చీఫ్‌లుగా డీజీ స్థాయి అధికారులనే నియమించాలి. ఆ విభాగాలను తాము స్వతంత్రంగా నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించాలి. ఐజీ స్థాయి అధికారులను నియమించి, మమ్మల్ని అవమానించడం ఏమాత్రం సరికాదు’ అన్నది తొలి డిమాండ్‌. అందుకు విరుద్ధంగా ఐజీ స్థాయి అధికారులను నియమిస్తే రాజీనామా చేస్తానని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్పష్టం చేసినట్టు సమాచారం.

» తమకు రెగ్యులర్‌ డీజీపీగా అవకాశం లేకుండా పోయింది కాబట్టి కనీసం రెగ్యులర్‌ డీజీ పే స్కేల్‌ అయిన లెవల్‌ 17 పే స్కేల్‌ను అమలు చేయాలని రెండో డిమాండ్‌ లేవనెత్తారు. ఈ మేరకు ఓ డీజీ ఇప్పటికే లిఖిత పూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతోపాటు నలుగురు డీజీలు తమకు లెవల్‌ 17 పే స్కేల్‌ వర్తింప జేయాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధపడినట్టే.

» సీఐడీ మినహా మిగిలిన డీజీ స్థాయి అధికారులు డీజీపీ కార్యాలయం ఉన్న రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతున్నారు. గతంలో రాజేంద్రనాథ్‌ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు అప్పటి డీజీ స్థాయి అధికారిగా ఉన్న హరీశ్‌ కుమార్‌ గుప్తా విముఖత చూపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయన పట్టుబట్టి హోమ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

» ప్రస్తుతం తమకు కూడా అదే రీతిలో పోలీసు ప్రధాన కారాలయంలో కాకుండా, ఇతర చోట్ల నుంచి డీజీ హోదాలో విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అంటే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎవరూ డీజీపీ గుప్తా ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు సుముఖతగా లేరన్నది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డీజీ స్థాయి అధికా­రుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement