
ఆరాంఘర్‌లోని ఆర్టీసీ టెర్మినల్ ప్రతిపాదిత స్థలం ఇదే. దీనిని పోలీసు శాఖకు కేటాయించారు (ఇన్‌సెట్)లో రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్‌డిపో
సర్వే చేయకుండా నిర్ణయాలు
ఆరాంఘర్ కూడలిలో నిత్యం ఆగుతున్న 2,200 బస్సులు
పక్కనే ఉన్న ప్రభుత్వ ఖాళీ భూమిలో టెర్మినల్ నిర్మాణానికి ప్లాన్
పోలీస్ శాఖకు ఉపయోగపడే భూమి ఆర్టీసీ వద్ద అందుబాటులో
డిపో స్థలాన్ని పోలీస్‌శాఖకు కేటాయించి, ఆరాంఘర్ భూమి ఆర్టీసీకి ఇస్తే సమస్య పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి అనువైన స్థలానికి పోలీస్‌శాఖకు కేటాయించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా, సర్వే చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ ప్రధాన రోడ్డు మీద ఉన్న ఆరాంఘర్ కూడలి ప్రాంతంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి ఆర్టీసీ ప్లాన్ చేసుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఏపీలోని కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి లాంటి రాయలసీమ ప్రాంతాలు, బెంగళూరు, రాయచూరు లాంటి ప్రాంతాలకు నిత్యం బస్సులు ఈ కూడలిలో ఆగుతుంటాయి.
ఆయా మార్గాల్లో వెళ్లే దాదాపు 700 బస్సులు ఇక్కడ నిలుస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడే జమ అవుతుండటంతో సిటీ బస్సులకు కూడా ఇది కేంద్రంగా మారింది. అక్కడ దాదాపు 1,500 సిటీ బస్సులు నిలుస్తాయి. దీంతో ఇదే ప్రాంతంలో అటు సిటీ, ఇటు అంతర్రాష్ట్ర సర్విసులు నిలిపేందుకు వీలుగా పెద్ద టెర్మినల్ నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
కూడలిలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ వెల్ఫేర్‌కు చెందిన 14 ఎకరాల ఖాళీ స్థలం ఉండటంతో, అందులో ఏడెకరాల భూమి తమకు కేటాయిస్తే జూబ్లీ బస్టాండు కంటే పెద్ద టెర్మినల్ నిర్మిస్తామని, ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. మానసిక పరిపక్వత లేని చిన్నారుల కోసం అక్కడ ఓ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం ఈ స్థలాన్ని గతంలో ప్రైవేట్ సంస్థకు కేటాయించింది. కొంతకాలంగా ఆ సంస్థ కార్యకలాపాలు లేకపోవటంతో ఆ స్థలం ఖాళీగానే ఉంది. సానుకూలంగా స్పందించి..
ఆ తర్వాత పోలీసు శాఖకు కేటాయింపు..
ఆర్టీసీ విన్నపానికి తొలుత సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆ తర్వాత మనసు మార్చుకొని దాన్ని పోలీస్ శాఖకు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి గోషామహల్‌లోని పోలీసు మైదానంలో దాదాపు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించటంతో, పోలీస్ శాఖకు ప్రత్యామ్నాయ స్థలంగా ఆరాంఘర్ స్థలాన్ని కేటాయించింది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం సర్వే చేసినట్టు కనిపించటం లేదు.
ఆరాంఘర్ కూడలికి కూతవేటు దూరంలో రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్‌డిపో ఉంది. దాదాపు 9 ఎకరాల స్థలంలో ఇది విస్తరించి ఉంది. బస్‌డిపోను ఆనుకునే రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఉంది. ఇదే ప్రాంగణంలో ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్లు ఉంటాయి. ఇవన్నీ పోను ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ స్థలం ఉంది. ఇదంతా పోలీస్ శాఖ అధీనంలోనే ఉన్నందున, పక్కనే ఉన్న ఆర్టీసీ బస్‌డిపో స్థలాన్ని.. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ కోల్పోయినందుకు ప్రత్యామ్నాయ భూమిగా సేకరించి పోలీస్‌శాఖకు అందిస్తే.. ఆ శాఖకు సంబంధించిన ఇక్కడి కార్యాలయాలు ఒకే చోట ఉన్నట్టవుతుంది.
ఇప్పుడు ఆరాంఘర్ కూడలిలోని స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే, కోల్పోయే రాజేంద్రనగర్ డిపో సహా కొత్త టెర్మినల్‌ను అక్కడే నిర్మించుకునే వీలుంది. దీంతో ఆర్టీసీకి సంబంధించిన నిర్మాణాలన్నీ ఒకేచోట ఉంటాయి. ఇది ఇటు ఆర్టీసీకి, అటు పోలీస్ శాఖకు అనుకూలంగా ఉండే వీలుంది. ఈ కోణంలో ఉన్నతాధికారులు యోచించకుండా, రెండు శాఖలకు అసౌకర్యంగా ఉండే నిర్ణయం తీసుకోవటం విశేషం. ఆరాంఘర్ కూడలిలో కాకుండా, వేరే చోట ఆర్టీసీ టెర్మినల్ నిర్మిస్తే ఉపయోగం అంతగా ఉండదని, వేరే చోట కొత్త టెర్మినల్ నిర్మించినా.. ప్రయాణికులు ఎక్కువ మంది మళ్లీ ఆరాంఘర్ కూడలికే వస్తారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.