ఆరోగ్యశాఖలో.. అందరూ ఇన్‌చార్జ్‌లే   | Incharges Playing A Key Role For Medical Department In Nalgonda | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో.. అందరూ ఇన్‌చార్జ్‌లే  

Jul 15 2019 7:53 AM | Updated on Jul 15 2019 7:55 AM

Incharges Playing A Key Role For Medical Department In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ టౌన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అందరూ ఇన్‌చార్జ్‌లే దిక్కయ్యారు. ఆ శాఖకు అధిపతి అయిన డీఎంహెచ్‌ఓతోపాటు అనుబంధ విభాగాల జిల్లా అధికారులు కూడా ఇన్‌చార్జ్‌లే ఉన్నారు. ప్రస్తుతం అంటు వ్యాధులు ప్రబలే సీజన్‌. ఈ సమయంలో జిల్లాస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల వ్యాధులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకునే వారు కరువయ్యారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఆ శాఖ సాధించలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కింది స్థాయి పరిపాలనా వ్యవస్థలో పర్యవేక్షణ లోపించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ కె.భానుప్రసాద్‌నాయక్‌ జనవరిలో బదిలీ కావడంతో అప్పటి జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ వై.గంగవరప్రసాద్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓగా ఈ నెల 1న డాక్టర్‌ ఎ.కొండల్‌రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారిగా పనిచేస్తూ డాక్టర్‌ ఏబీ నరేంద్ర ఎనిమిది నెలల క్రితం రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఇన్‌చార్జ్‌ డీఐఓగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా లెప్రసీ అండ్‌ ఏయిడ్స్‌ నియంత్రణాధికారిగా కూడా ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓకే బాధ్యతలను అప్పగించడం గమనార్హం.

జిల్లా మలేరియా అధికారి ఓంప్రకాష్‌ ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేయడంతో అప్పటినుంచి అర్భన్‌ మలేరియా అధికారిగా ఆర్‌.దుర్గయ్యకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఖాళీగా ఉన్న జిల్లా మాస్‌మీడియా అధికారిగా బిరుదుల వెంకన్న ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అన్ని ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. అతి ముఖ్యమైన ఈ శాఖలో ఐదు జిల్లాస్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. 

ఖాళీలతో కష్టాలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ముఖ్య ప్రధాన పోస్టులకు ఇన్‌చార్జీలే దిక్కు కావడం ఒక వంతైతే ఇక క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన సిబ్బందికి సంబంధించి 381 పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. అందులో నాలుగో తరగతి సిబ్బంది. స్టాఫ్‌నర్సులు, మెడికల్‌ ఆఫీసర్లు, ల్యాబ్‌టెక్నీషియన్‌లు, కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజర్లు, ఎంపీహెచ్‌ఏ మేల్‌ ఆండ్‌ ఫిమేల్‌ హెల్త్‌ సూపర్‌వైజర్లు, డ్రైవర్లు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

వ్యాధుల సీజన్‌
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు వ్యాప్తి చెందితే ఉన్న కాస్త సిబ్బంతో వ్యాధులను ఎలా అరికట్టగలరో వైద్య ఆరోగ్య శాఖకే తెలియాల్సి ఉంది. సీజన్‌లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, స్వైన్‌ప్లూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారుల పోస్టులను రెగ్యులర్‌ వారితో భర్తీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement