
శుక్రవారం గట్ల నర్సింగాపూర్‌లో 30 రోజుల కార్యాచరణను ప్రారంభించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు శుక్రవారం ప్రారంభమైంది. గ్రామసీమల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యక్రమాలను అందరి భాగస్వామ్యంతో చేపట్టేందుకు దీనిని రూపొందించారు. వరంగల్ అర్బన్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, పీఆర్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 30 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
తొలిరోజు ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన పంచాయతీలకు వెళ్లి గ్రామసభలు ప్రారంభించి 30 రోజుల ప్రణాళిక ప్రాధాన్యతను వివరిస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రణాళికలో భాగంగా శనివారం స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల లక్ష్యాలను ఆ కమిటీలకే అప్పగిస్తారు. స్టాండింగ్ కమిటీల్లో వార్డు సభ్యులు, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసే యువత, మహిళా సంఘాలు, సీనియర్ సిటిజన్లను భాగస్వాములను చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.