
సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కలుస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 134 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయ కక్షలు వద్దని కార్యకర్తలకు సూచించారు. తనకూ, కేసీఆర్‌కు ఏలాంటి గొడవలు లేవని, కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్‌ని కలిసి మెడికల్ కళాశాలను నిర్మించాలని కోరతానని పేర్కొన్నారు.
తాను బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మెద్దని అన్నారు. తన ఆరోగ్యం, ఆర్థికస్థితి కోలుకున్నాక పూర్తిగా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి తనకు ఆరునెలల సమయం కావాలని కార్యకర్తలను కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయ్యలేదని మండిపడ్డారు.