ఆడపులి కోసం వేట షురూ..! | Hyderabad's expert shooter Nawab Shafat Ali Khan starting hunt for lady tiger | Sakshi
Sakshi News home page

మరో వేట షురూ..!

Dec 18 2017 8:40 AM | Updated on Dec 18 2017 8:40 AM

Hyderabad's expert shooter Nawab Shafat Ali Khan starting hunt for lady tiger - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీ హంటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ మహారాష్ట్రలో మరో ఆపరేషన్‌ చేపట్టారు. యవత్‌మాల్‌ జిల్లాలో మ్యానీటర్‌గా మారి బీభత్సం సృష్టిస్తున్న ఆడపులి కోసం శనివారం వేట ప్రారం భించారు. ఇదే రాష్ట్రంలోని థూలే జిల్లాలో మ్యానీటర్‌గా మారిన ఓ చిరుతను గత శనివారం మట్టుపెట్టారు. ఈ ఆపరేషన్‌ ముగించుకుని సిటీకి వచ్చిన అలీ ఖాన్‌ శనివారం మళ్లీ యవత్‌మాల్‌ చేరుకున్నారు. తమ తొలి ప్రాథాన్యం ఆ పులికి మత్తుమందు ఇచ్చి (ట్రాంక్విలైజింగ్‌) పట్టుకోవడమే అని ఆయన ఆదివారం ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. యవత్‌మాల్‌ జిల్లాలోని పంథర్‌కావ్డా, తెపీశ్వర్‌ గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తొలిసారిగా 2014లో ఓ ఆడపులి ప్రవేశించింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలు అప్పట్లో తొలిసారిగా ఈ పులిని చిత్రీకరించాయి. గత ఏడాది హఠాత్తుగా మ్యానీటర్‌గా మారిన ఈ ఆడపులి గ్రామాలపై దాడులు ప్రారంభించింది.

తొలినాళ్ళల్లో పొలాలు, ఇళ్ళ బయట ఉన్న పశువులు, మేకల్ని చంపేది. అయితే పశువులు, మేకల కోసం జనావాసాల మధ్య సంచరించడంతో దీనికి మనుషులంటే భయంపోయింది. దీంతో కనిపించిన వారిపై దాడి చేసి చంపడం మొదలెట్టింది. గత ఏడాది నలుగురిని చంపిన ఈ ఆడ పులి అనేక మందిని గాయపరిచింది. కొన్నాళ్ళ పాటు స్తబ్ధుగా ఉన్న ఈ పులి ఈ నెల మొదటి వారం నుంచి మళ్ళీ విజృంభించింది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురిని చంపేసింది. వీరిలో ముగ్గురి మృతదేహాలను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి తినేసింది. గత శనివారం అడాన్‌ గ్రామ శివార్లలో ఓ రైతుపై దాడి చేసి చంపేసిన ఈ పులి అతడి ఎడమకాలను పూర్తిగా తినేసింది. ఈ ఘటనతో ఈ గ్రామంతో పాటు పంథర్‌కావ్డా, తెపీశ్వర్‌ గ్రామాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది.

దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై స్పందించిన అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారం రోజులు ప్రయత్నించినా కనీసం దాని ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. దీంతో యవత్‌మాల్‌ డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కేఎం అపర్ణ హైదరాబాద్‌కు చెందిన నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ను ఆహ్వానించారు. శనివారం అక్కడకు చేరుకున్న ఆయన ఆదివారం నుంచి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. అలీ ఖాన్‌ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా ఆ పులి ఆచూకీని కనిపెట్టాలి. పగటిపూట ఎక్కడ తల దాచుకుంటోందో గుర్తించాలి. ఆపై అది మ్యానీటర్‌గా మారడానికి కారణాలను విశ్లేషించాలి. ఈ పులికి మత్తుమందు ఇచ్చి బంధించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆపరేషన్‌ చేపట్టాం’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement