కిడ్నాప్‌... కాదు ట్రీట్‌మెంట్‌!

Hyderabad Police Tension For Fake Kidnap Drama - Sakshi

సైఫాబాద్‌లో బాలుడి అపహరణ అంటూ కలకలం

చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ

మానసిక వైద్యం కోసం తెచ్చినట్లు గుర్తింపు

దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం

సాక్షి, సిటీబ్యూరో: ఉదయం 11.30 గంటల సమయం... తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతం... రెడ్‌ సిగ్నల్‌ పడటంతో ఆగిన ఎర్తిగ వాహనం... వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడిని ఒడిసి పట్టుకున్నారు... ముందు కూర్చున్న మరో వ్యక్తి డ్రైవర్‌ను త్వరగా పోనీయమంటూ ఒత్తిడి చేశాడు... ఈ సీన్‌ చూసిన ఓ వాహనచోదకులు అది కిడ్నాప్‌గా ‘గుర్తించాడు’. ఆ వాహనం దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించే లోపే గ్రీన్‌ సిగ్నల్‌ పడటంతో అది ట్యాంక్‌బండ్‌ మీదుగా దూసుకుపోయింది. అప్రమత్తమైన ఆ వాహనచోదకుడు ‘డయల్‌–100’కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చాడు. దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఓ ఘటన సైఫాబాద్‌ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి చొరవతో కిడ్నాప్‌ కాదు ‘ట్రీట్‌మెంట్‌’గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

కుమారుడి వైద్యం కోసం తీసుకువచ్చి...
అదిలాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు (14 ఏళ్ళు) మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి వైద్యం చేయించడానికి ఎర్తిగా వాహనంలో డ్రైవర్‌ను తీసుకుని సోమవారం సిటీకి వచ్చారు. తొలుత ఆ బాలుడిని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తీసుకువెళ్ళారు. అయితే మైనర్లకు తాము పరీక్షలు, వైద్యం చేయమని తేల్చిచెప్పిన అక్కడి వైద్యులు బాలుడిని రెడ్‌హిల్స్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళాల్సిందిగా సూచించారు. దీంతో ఆ తండ్రి తన కుమారుడిని నీలోఫర్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ చైల్డ్‌ సైకియాట్రీకి తీసుకువెళ్ళారు. అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షలు చేసి కొన్ని మందులు రాసిచ్చి పంపారు. సికింద్రాబాద్‌ మీదుగా అదిలాబాద్‌కు తిరిగి వెళ్ళడానికి ఈ బాలుడిని తీసుకుని తండ్రి, తదితరులు ఎర్తిగ వాహనంలో బయలుదేరారు.   

బాలుడు మారాం చేస్తుండటంతో...
ముందు భాగంలో డ్రైవర్‌ పక్క సీటులో ఓ వ్యక్తి కూర్చోగా... బాలుడిని తీసుకుని అతడి తండ్రి, మరో వ్యక్తి వెనుక సీటులో కూర్చున్నారు. వీరిద్దరికీ మధ్యలో బాలుడిని కూర్చోబెట్టుకున్నారు. వీరి వాహనం రెడ్‌హిల్స్‌ నుంచి లక్డీకాపూల్, ఇక్బాల్‌ మీనార్, సచివాలయం మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తాకు చేరుకుంది. అదే సమయంలో రెడ్‌ సిగ్నల్‌ పడటంతో వాహనం ఆగింది. ఈ నేపథ్యంలోనే కారులో ఉన్న బాలుడు మారాం చేస్తుండటంతో పాటు దిగిపోయే ప్రయత్నాలు చేయడం మొదలెట్టాడు. దీంతో తండ్రి, మరో సహాయకుడు అతడిని ఒడిసిపట్టుకున్నారు. ఈ సీన్‌నే అక్కడున్న ఓ వాహనచోదకుడు చూశాడు. వాహనం వద్దకు వెళ్ళి ప్రశ్నించే లోపే గ్రీన్‌ సిగ్నల్‌ పడటంతో అది ట్యాంక్‌బండ్‌ మీదుగా దూసుకుపోయింది.    

రంగంలోకి దిగిన సైఫాబాద్‌ ఏసీపీ...
తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతంలో సైఫాబాద్‌ ఠాణా పరిధిలోని వస్తుంది. దీంతో కంట్రోల్‌ రూమ్‌ వారు ఆ ఠాణా అధికారులతో పాటు ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. విషయం తెలుసుకున్న మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్‌ సైతం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలుత సైఫాబాద్‌ ఏసీపీ మూడు కమిషనరేట్లలో ఉన్న అన్ని ఠాణాలకూ సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. ఆపై తెలుగుతల్లి చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ ఆధారంగా వాహనం నెంబర్‌ గుర్తించారు. ఈ నెంబర్‌ను బట్టి ఆర్టీఏ డేటాబేస్‌ ద్వారా వాహనం యజమాని పేరు, సెల్‌ఫోన్‌ నెంబర్‌ సేకరించారు. ఆ పేరును ఫేస్‌బుక్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా ఆ యజమాని ఫొటోతో పాటు అతడి కుటుంబీకుల ఫొటోలు గుర్తించి సేవ్‌ చేసి ఉంచారు. ఆపై సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా యజమానిని నేరుగా సంప్రదించారు. అప్పటికే ఆ వాహనం డిచ్‌పల్లి వద్దకు చేరుకుంది.   

మూడు మార్గాల్లో క్రాస్‌ చెక్‌ చేశాక...
సైఫాబాద్‌ ఏసీపీతో ఫోన్‌లో మాట్లాడిన వాహన యజమాని తామే వైద్య పరీక్షల అనంతరం సిటీ నుంచి వస్తున్నామని, ఆ వాహనంలో ఉన్నది తన కుమారుడని చెప్పారు. ఈ విషయాన్ని పూర్తిగా విశ్వసించని ఏసీపీ ఓపీ స్లిప్స్‌తో పాటు వాహనం, కమారుడితో కలిపి ఫొటోలను తీసి వాట్సాప్‌లో పంపమని సూచించారు. వారు అలాగే చేయడంతో ఓ ఫొటోలు ఉన్న వాహనం నెంబర్‌ చూసి ఖరారు చేసుకున్నారు.
 ఆపై యజమాని, కుమారుడిని అప్పటికే ఫేస్‌బుక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన వాటిలో సరిచూసి నిర్థారించుకున్నారు. ఆపై ఓ బృందానికి ఓపీ స్లిప్స్‌ ఇచ్చి నీలోఫర్‌కు, మరో బృందాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపారు. ఆ రెండు చోట్ల ఉన్న వైద్యులు వారు చెప్పినవి సరైన వివరాలేనంటూ స్పష్టం చేశారు. ఈ వివరాలు అన్నీ మరోసారి సరిచూసిన ఏసీపీ సంతృప్తి చెందిన తర్వాత డిచ్‌పల్లి నుంచి ముందుకు వెళ్ళేందుకు వారికి అనుమతి ఇచ్చారు. పూర్తి వివరాలను మధ్య మండల డీసీపీకి నివేదించి కిడ్నాప్‌ కాదని, కేవలం ట్రీట్‌మెంట్‌ అని తేల్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top