పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ

Hyderabad Man Enter Pakistan Illegally - Sakshi

భాగ్యనగరానికి చెందిన ప్రశాంత్‌ అంటున్న అంతర్జాతీయ మీడియా

ఈ నెల 14న ఇద్దరిని అరెస్టు చేసిన చోలిస్తాన్‌ పోలీసులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదులో జరిగిన పేలుడు కేసులో టోలిచౌకిలో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్‌ అరెస్టైన విషయం మరువక ముందే మరో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్‌ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అని తెలుస్తోంది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో పాకిస్తాన్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్‌ కుట్ర పన్నిందని పాక్‌ మీడియా ఆరోపించింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రశాంతేనని.. అతడు 2017 నుంచి కనిపించట్లేదని సమాచారం. ఆ యువకుడు తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్‌చల్‌ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రశాంత్‌ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా వార్తల ఆధారంగా విచారణ చేపట్టామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు.

ఆ వీడియోలోని మాటలివి.. 
‘‘కెన్‌ ఐ స్పీక్‌ ఇన్‌ మై ఓన్‌ లాంగ్వేజ్‌ (నేను నా మాతృ భాషలో మాట్లాడవచ్చా)... మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇప్పుడు పోలీసుస్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ ప్రాబ్లం లేదని డిక్లేర్‌ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాళ్లు ఇండియన్‌ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్‌ ప్రాసెస్‌ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడం అవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్‌ వాళ్లు ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటారు. దీనికి ఓ నెల వరకు పడుతుంది. ఇప్పుడు కోర్టులో ఉన్నా.. జైలుకు వెళ్లిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడానికి అవకాశం ఉంటుంది.’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top