
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్డపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి సిబ్బంది అంతా విధుల్లోనే ఉన్నారని, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపి వాహనాలను పంపించామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారలతో మాట్లాడి సమస్య సరిష్కారాలను కనుకుంటున్నట్లు సీపీ తెలిపారు. అవసరమైతే జేఎన్‌టీయూ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. వర్షం కారణంగా ప్రజలకు కొంత ఇబ్బందులు కలిగాయన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, సికింద్రాబాద్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మలక్‌పేట, ఎల్‌బీ నగర్, సంతోష్‌నగర్, అల్వాల్, బొల్లారం, మెహదీపట్నంలలో ఆదివారం భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులతోపాటు ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కూకట్‌పల్లిలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గంటపాటు వర్షం కురిస్తేనే రోడ్లు చెరవులను తలపించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. మరోవైపు నేడు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగస్తులు చల్లటి వాతావరణాన్నిఆస్వాదిస్తున్నారు.