ఉన్నతాధికారులు వేధిస్తున్నారు.. కాపాడండి!

Higher officials are harassing says CISF Constable - Sakshi

మూడేళ్లలో 10 వారాంతపు సెలవులు కూడా ఇవ్వలేదు 

సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆవేదన

హైదరాబాద్‌: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకపోతున్నానని, ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన కానిస్టేబుల్‌ దౌడ్‌ సంతోష్‌ శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, బీడ్‌ జిల్లా పర్లి గ్రామానికి చెందిన తాను దేశంపై భక్తితో సీఐఎస్‌ఎఫ్‌లో చేరానని చెప్పారు. మూడేళ్లుగా హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో విధులు నిర్వహిస్తున్నానని, అక్కడి అసిస్టెంట్‌ కమాండర్‌ సావంత్, ఇన్‌స్పెక్టర్‌ చమన్‌లాల్‌  వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. నెలకు ఒకసారి వారాంతపు సెలవుల లిస్ట్‌ వస్తుందని, దాని ప్రకారం తాను సెలవు తీసుకుంటే ఫోన్లు చేసి డ్యూటీకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు 10 వారాంతపు సెలవులు కూడా తీసుకోలేదని తెలిపారు. సెలవులు లభించడంలేదని ప్రశ్నించడంతో తనపై కక్ష పెంచుకున్నారన్నారు. కమాండర్‌ ఇంట్లో గార్డెనింగ్‌ విధులు చేయాలని ఒత్తిడి చేస్తే తాను అంగీకరించలేదని, ఇన్‌స్పెక్టర్‌ చమన్‌లాల్‌ కొన్ని ప్రైవేట్‌ సంస్థలకు చెందిన బ్రష్, టూత్‌ పేస్ట్, సబ్బులు  విక్రయిస్తుంటారని, వాటిని తాను కొనుగోలు చేయకపోవడంతో తనను వేధిస్తున్నారని తెలిపారు. ఇక్కడి అన్యాయాలపై కమాండర్‌కు, డీఐజీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చినందుకు తనపై చర్యలు తీసుకుంటారని, తనకు ఏం జరిగినా పరవాలేదని, తన తోటి సోదరులకైనా న్యాయం జరగాలని అన్నారు. వారానికి ఒక సెలవుఇవ్వాలని, కుదరని పక్షంలో నెలకు 3 రోజులైనా సెలవులు ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నం
అధికారుల తీరుకు తీవ్ర మానసిక వేదనకు గురైన దౌడ్‌ సంతోష్‌ శివాజీ ఓవైపు సమావేశం జరుగుతుండగానే తన వెంటతెచ్చుకున్న బ్లేడుతో చేయికోసుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న మీడియా సిబ్బంది అడ్డుకుని బ్లేడ్‌ లాక్కున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top