రక్షిత గృహాల్లో మీకేం పని?  | The High Court was angry over the passage of the leaders of Yadavri victims | Sakshi
Sakshi News home page

రక్షిత గృహాల్లో మీకేం పని? 

Jan 25 2019 12:34 AM | Updated on Jan 25 2019 12:34 AM

The High Court was angry over the passage of the leaders of Yadavri  victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘యాదాద్రి’ఘటనలో బాధిత బాలికలను సందర్శించేందుకు స్థానిక నేతలు, ప్రైవేటు వ్యక్తులకు జిల్లా సంక్షేమ కమిటీలు అనుమతులివ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షిత గృహాల్లో నేతలకు పనేముందని ప్రశ్నించింది. ఇకపై ఎవరినీ బాధిత బాలికల వద్దకు అనుమతించవద్దంటూ రక్షిత గృహ నిర్వాహకులను హెచ్చరించింది. కేసు దర్యాప్తులో ఉన్నందున చిన్నారుల సంర„ý కులమని చెప్పుకునే వారిని కూడా అనుమతించ వద్దని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా దౌర్జన్యంగా వ్యవహరిస్తే.. వారిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.

బాధిత చిన్నారులను సందర్శించేందుకు ఇప్పటి వరకు ఎవరెవరొచ్చారు? ఎవరెవరికి, ఎందుకు, ఎవరు అనుమతినిచ్చారని ప్రశ్నించింది. ఈ వివరాలను సీల్డ్‌ కవర్‌లో తన ముందుంచాలని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల బాలల సంక్షేమ కమిటీలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. గురువారం విచారణ సందర్భంగా రక్షిత గృహం ‘ప్రజ్వల’తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ రక్షిత గృహంలో ఉన్న చిన్నారులను ఓదార్చేందుకు స్థానిక నేతలు వస్తున్నారని, వీరికి ఆయా జిల్లాల బాలల సంక్షేమ కమిటీలు అనుమతులు ఇచ్చారని కోర్టుకు నివేదించారు. దీనిపై అభ్యంతరం చెబితే, వచ్చిన నాయకులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించి.. అధికారులను హెచ్చరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement