సర్పంచుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోండి

High court on surpanches continuation - Sakshi

సర్కార్‌కు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలంటూ పలువురు సర్పంచ్‌లు చేస్తున్న అభ్యర్థనలపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా, ఏదులాబాద్‌ గ్రామ సర్పంచ్‌ బట్టే శంకర్, మరో ఏడు మంది సర్పంచ్‌లు హైకోర్టులో మంగళవారం లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. చట్టంలో ఎక్కడా కూడా స్పెషల్‌ ఆఫీసర్ల నియామక ప్రస్తావనే లేదని తెలిపారు. స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం వల్ల ఆయా పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడే అవకాశం ఉందన్నారు. అందువల్ల సర్పంచ్‌లను యథాతథంగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సర్పంచ్‌లు చేస్తున్న అభ్యర్థనలపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top