రూ.457.78 కోట్లు చెల్లించండి

High Court orders to the state govt that to Pay Rs 457.78 crores  - Sakshi

     డిసెంబర్‌ 31లోగా భూసేకరణ పరిహారం చెల్లించాల్సిందే

     రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం సేకరించిన భూములకు సంబంధించిన రూ.457.78 కోట్ల పరిహారాన్ని ఆరు వాయిదాల్లోగా బాధితులకు చెల్లించి తీరాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31లోపు పరిహారం మొత్తాన్ని అందజేయాలని.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. విచారణను ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

న్యాయమూర్తి లేఖ పిల్‌గా.. 
భూసేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు అమలు చేయడం లేదని.. ఉత్తర్వుల అమలు కోసం బాధితులు దాఖలు చేస్తున్న ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు (ఈపీ)లు ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి జి.వెంకటకృష్ణయ్య గతంలో ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించి.. వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో బుధవారం విచారణ కొనసాగించింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు.. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఈపీలు, చెల్లించాల్సిన సొమ్ము వివరాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. 

వాయిదాల్లో చెల్లిస్తాం.. 
తెలంగాణలోని 31 జిల్లాల్లో 1,669 ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.457.78 కోట్లు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన అఫిడవిట్‌లో కోర్టుకు వివరించారు. ఈ సొమ్మును వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని విన్నవించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ హామీని తాము నమోదు చేస్తామని, దీని ప్రకారం చెల్లింపులు పూర్తిచేసి తీరాలని స్పష్టం చేసింది. లేకుంటే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 918 ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.62.88 కోట్లు చెల్లించాల్సి ఉందని కోర్టుకు వివరణ ఇచ్చింది. మూడు నెలల్లో ఈ సొమ్ము చెల్లించేసి ఈపీలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

పరిహారం అంతేనా? 
తెలంగాణ ప్రభుత్వం రూ.457 కోట్లు, ఏపీ కేవలం రూ.62 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందని చెప్పడంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. భారీ ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు భూసేకరణ భారీగా ఉంటుందని... పరిహారం కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుందని గుర్తు చేసింది. అందువల్ల ఇరు రాష్ట్రాల్లోని కింది కోర్టు ల్లో పెండింగ్‌లో ఉన్న పరిహారం ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు, చెల్లించాల్సిన సొమ్ము వివరాలను.. ప్రభుత్వాలు సమర్పించిన వివరాలతో పోల్చి చూస్తామని పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలను సేకరించి మార్చి నెలాఖరుకల్లా తమ ముందుంచాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశిస్తూ.. విచారణను ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top