తాగి నడిపితే.. వాహనం తిరిగి ఇవ్వరా?

High Court Mandate to Madhapur Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక రోజు తాగి వాహనం నడిపారన్న కారణంతో వాహనాన్ని పోలీసులు తమ స్వాధీనంలోనే ఉంచేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒక రోజు తాగి వాహనం నడిపితే, ఆ రోజున తప్ప, మిగిలిన అన్ని రోజుల్లో కూడా పోలీసులు ఆ వాహనాన్ని తమ స్వాధీనంలోనే ఉంచుకోవడం చెల్లదంది. జూబ్లీహిల్స్‌కు చెందిన కోమటిరెడ్డి రిషికేష్‌ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తిరిగి అతనికి అప్పగించాలని మాదాపూర్‌ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన రిషికేష్‌రెడ్డి కారు డ్రైవర్‌ గతేడాది డిసెంబర్‌ 8న మాదాపూర్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికాడు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని సవాలు చేస్తూ రిషికేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తన వాహనాన్ని పోలీసులు స్వాధీనంలోనే ఉంచుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నానని, తాను పడుతున్న కష్టానికి రూ.లక్ష అదనపు ఖర్చు కింద చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించాలని కోరారు. తన వాహనాన్ని విడుదల చేసేలా మాదాపూర్‌ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ జరిపారు. ఈ వాహనాన్ని పోలీసులు తమ స్వాధీనంలోనే ఉంచేసుకోవడం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆర్సీ బుక్, గుర్తింపు కార్డులతో మాదాపూర్‌ పోలీసుల వద్దకు వెళ్లాలని రిషికేష్‌రెడ్డిని ఆదేశించారు. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత రిషికేష్‌రెడ్డి వాహనాన్ని వెంటనే అతనికి ఇచ్చేయాలని తీర్పు ఇచ్చారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top