టీచర్ల బదిలీలకు లైన్‌ క్లియర్‌

High Court Gives Green Siganl To Telangana Teacher Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్‌ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. టీచర్ల బదిలీ ప్రక్రియ నిలిపి వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం  నిర్ణయం తీసుకుంది. బదిలీలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన 125 పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. 

మరోవైపు.. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్‌ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సురేందర్‌రావు వాదించిన విషయం తెలిసిందే. 

‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్‌జేడీలకు అప్పగించాం. పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యాజ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్‌ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. గతంలో పలు దఫాలు వాయిదా పడగా.. బదిలీలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను నేడు కొట్టివేసిన ధర్మాసనం ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top