మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది  

High court fires on plastic usage - Sakshi

     ప్లాస్టిక్‌ వినియోగంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

     మనిషి వంటి క్రూర జంతువు భూగ్రహంపైనే లేదు

     శబరిమలలోలాగా ప్లాస్టిక్‌ నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

     ఉల్లంఘనలను ప్రాసిక్యూట్‌ చేయండి.. జరిమానాలు విధించండి

     స్థానిక సంస్థలకు, దేవస్థానాలకు ఆదేశాలు ఇవ్వండి

సాక్షి, హైదరాబాద్‌: ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శబరిమలలో మాదిరిగా ఇక్కడి దేవస్థానాల్లో కూడా ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనికిగాను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగించాలని సూచించింది. ఉల్లంఘనలను ప్రాసిక్యూట్‌ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలకు ఉపక్రమించాలని తేల్చి చెప్పింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. నిబంధనలు సరళంగా, సూటిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ నిషేధంపై స్థానికసంస్థలకు, దేవాదాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంది. మనిషి వంటి క్రూర జంతువు నిస్సందేహంగా ఈ భూగ్రహం మీదే లేదని, మనిషన్న ఓ జంతువు తాను అడుగుపెట్టిన ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

దేవస్థానాల్లో ప్లాస్టిక్‌ నిషేధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల ఇబ్బందులను, నిర్వహణ లోటుపాట్లను సరిదిద్దే దిశగా సుప్రీం తీర్పు అమలులో భాగంగా నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల ప్రధాన న్యాయాధికారులు స్థానిక దేవస్థానాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచిన వాటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ధర్మాసనం స్పందిస్తూ ఢిల్లీలో ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో ఉందని తెలిపింది. 

శబరిమలలో 100% ప్లాస్టిక్‌ నిషేధం... 
శబరిమలలో ప్లాస్టిక్‌పై 100 శాతం నిషేధం అమల్లో ఉందని ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే అక్కడ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తుండటం విశేషమని పేర్కొంది. కర్పూరం, పసుపు, మిరియాలు వంటివి కూడా ప్లాస్టిక్‌ కవర్లలో తీసుకెళ్లడం లేదంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే రావాలని పేర్కొంది. 90 శాతం నాలాలు ప్లాస్టిక్‌ కారణంగా మూసుకుపోతున్నాయని తెలిపింది. జంతువులు కూడా ప్లాస్టిక్‌ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయంది. మనిషి వంటి క్రూరమృగం ఈ భూగ్రహంపైనే లేదన్న ధర్మాసనం, అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలను కూడా మనిషి ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అడవుల్లో అనేక జంతువులు ఆకస్మికంగా మృతి చెందుతున్నాయని, వీటిని మనుషులే చంపుతున్నారా? అవే చనిపోతున్నాయా? అన్నది మిస్టరీగా మారిందని పేర్కొంది. ప్లాస్టిక్‌ కాగితాలు, కవర్లు తిని జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమంది.  

జీవ మనుగడకు ప్లాస్టిక్‌ నిషేధమవసరం.. 
ఈ భూమి మీద మనిషితోపాటు ఇతర జంతుజాలాలు బతికి బట్టకట్టాలంటే, ప్లాస్టిక్‌ నిషేధం జరిగి తీరాలని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాలను ప్రశ్నించింది. నిబంధనల అమలులో చూపాల్సింది చిత్తశుద్ధేనని గుర్తు చేసింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై స్థానిక సంస్థలకు, దేవాలయాలకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిని ప్రాసిక్యూట్‌ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటివి చేపట్టాలంది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ఉభయ రాష ్ట్రప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top