
తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గృహ హింస, వరకట్నం కేసు ల్లో ఆరోపణలతో, భర్తపై కక్ష సాధింపుతో అత్తమామలపై పెట్టే కేసు చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని నిందితుల జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్లపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. తమ కోడలు సెక్షన్ 498 –ఏ కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర చోర్బుర్జికి చెందిన 74 ఏళ్ల గోవింద్ ప్రసాద్, అతని భార్య ఉషాశర్మ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున కపీష్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లపై ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదీ ఎలాంటి వివరాలను సమర్పించలేదని పేర్కొన్నారు. వేధింపులు, క్రూరత్వం, వరకట్నం డిమాండ్‌కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని వివరించలేకపోయారన్నారు. దీంతో పిటిషనర్లపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.