తెలంగాణ జిల్లాలను శుక్ర, శనివారాల్లో వర్షం ముంచెత్తింది.
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాలను శుక్ర, శనివారాల్లో వర్షం ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పోతంగల్ గ్రామానికి చెందిన మహిపాల్ (25) నది ఉధృతిని చూసేందుకు వచ్చి, నీటిలో గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా లో నీల్వాయి వాగు ఉప్పొంగడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్టుల్లో 48 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది శనివారం రాత్రి 25 అడుగులకు చేరింది. మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఇంటి పైకప్పు కూలి అండాళమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. కౌడిపల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో పాత పాఠశాల భవనం కూలిపోయింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపివేశారు.
శ్రీశైల జలాశయానికి వరద రాక కొనసాగుతోంది. జలాశయ నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 202.0439 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతం లో అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.