అకాల వర్షం.. తడిసిన ధాన్యం

Heavy Rain in Karimnagar Farmers Loss Crops - Sakshi

ఆదివారం వేకువజామున జిల్లావ్యాప్తంగా వర్షం

కల్లాల వద్ద తడిసిపోయిన ధాన్యం కుప్పలు

అమ్ముకునే సమయంలో ఆందోళనలో రైతులు 

మిర్చి, మామిడి పంటకు దెబ్బ

యాసంగి పంటకు రందిలేదు. పుష్కలమైన నీటితో సిరులు పండాయి. ఈ సారి దశ తిరిగినట్లే అని సంతోషపడుతున్న తరుణంలో అకాల వర్షం అన్నదాత నెత్తిన పిడుగై పడింది. తెగుళ్లకు, పెట్టుబడులకు ఓర్చి చేలోంచి కల్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం వరణుడి పాలైంది. జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో చాలా చోట్ల వరిధాన్యం నీటిపాలైంది. అసలే దిగుబడి అంతంతే ఉన్న మామిడి మరోసారి దెబ్బతింది. పంటకోసి నెలరోజులైనా కరోనా నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టులేక కల్లాల్లోనే ఉన్న మిర్చిపంట వర్షపునీటికి తడిసింది. ధర్మారం, పాలకుర్తి మండలాల్లో వర్షం పంటలపై ప్రభావం చూపగా.. మిగితా చోట్ల పాక్షికంగా ధాన్యం నీటిపాలైంది.

పెద్దపల్లిరూరల్‌/సుల్తానాబాద్‌రూరల్‌/ఎలిగేడు: పెద్దపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పెద్దపల్లి మండలంలోని బొంపల్లి, ముత్తారం, గౌరెడ్డిపేట ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. టోకెన్‌లు ఇచ్చిన తర్వాతే తేవాలని చెబుతున్నా రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని ఐకేపీ, సహకార అధికారులు పేర్కొంటున్నారు. అక్కడక్కడా మొక్కజొన్న పంటకూడా వర్షానికి తడిసింది. సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లి, చిన్నబొంకూర్, కనుకుల, తొగర్రాయి, దేవునిపల్లిలో కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఎలిగేడు మండలంలోని లోకపేట, ధూళికట్ట, ఎలిగేడు, నర్సాపూర్, శివుపల్లి, బుర్హాన్‌మియాపేట గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. మండలంలో 11.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలపల్లి మండలంలోని పెద్దాపూర్, చీమలపేట,తేలుకుంట, అబ్బాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

పాలకుర్తి, ధర్మారంలో భారీ వర్షం..
పాలకుర్తి/ధర్మారం: పాలకుర్తి మండల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం గంటపాటు కురిసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు తడిశాయి. పాలకుర్తి ఐకేపీకేంద్రంలో టార్ఫాలిన్లు లేకపోవడంతో సంచులన్నీ తడిసిపోయాయి. బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండేడ, పుట్నూర్, రామారావుపల్లి, జయ్యారం, గుడిపల్లి గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ధర్మారం మండలవ్యాప్తంగా 13.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలవ్యాప్తంగా ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పొలాల్లో వరి నేలవాలింది. మామిడి పంటకు సైతం తీవ్రనష్టం ఏర్పడిందని రైతులు వాపోయారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్మన్‌ లక్ష్మ ణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మంథని: మంథని నియోజకవర్గం పరిధిలో ఆదివారం వేకువజామున తేలికపాటి వర్షంకురిసింది. మంథని మండలంలోని నాగేపల్లి, అడవిసోమన్‌పల్లి, ఆరెంద,వెంకటాపూర్‌ గ్రామాల్లో ధాన్యం తడిసింది. కమాన్‌పూర్, రామగిరి మండలాల్లోనూ కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం పాక్షికంగా తడిసిపోయింది. మంథని మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంటకూడా తడిసిపోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top