ధాన్యం పుష్కలం.. కేంద్రాలు నిష్ఫలం


సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్:  ప్రకృతి ప్రకోపానికి ప్రతిసారీ బలవుతున్న రైతన్న ఈ రబీలో గట్టెక్కాడు.  అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడి ఇంటికి చేర్చాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు పెరగడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే ఈ కర్షకుడిని దైవం కరుణించినా...యంత్రాగం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. కొనుగోలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయడంతో వరికి మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. అదే అదునుగా దళారులు తమ దందా ప్రారంభించడంతో రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిచ్చింది పుచ్చుకుని...అపురూపంగా పండించిన పంటను అప్పగించి వెళ్లిపోతున్నాడు. కలలన్నీ కల్లలుగా మారడంతో కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆశలు రేపిన రబీ

 రబీ సీజన్ సిద్దిపేట ప్రాంత రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలను తట్టుకుని ఇంటికి చేరనున్న వరి ధాన్యాన్ని చూసి అన్నదాతలు తమ కష్టాన్ని మరచిపోతున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, తొగుట, కొండపాక మండలాల్లో సగటున మండలానికి 10 వేల ఎకరాల్లో  వరి సాగైంది. సకాలంలో నాటు వేయడం, అవసరమైనంత నీరు అందించడంతో వరి దిగుబడి కూడా ఈసారి పెరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు కోతలు ప్రారంభించారు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఇప్పటికే 40 శాతం పంటను కోశారు. మిగిలిన పంటను మరో వారంరోజుల్లో ఇంటికి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన పలువురు రైతులు వరిధాన్యాన్ని సిద్దిపేట మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. జాడలేని ఐకేపీ కేంద్రాలు

 పెరిగిన దిగుబడి చూసి ఆనందపడిన రైతులు...ఇక తమ కష్టాలన్నీ తీరాయనుకున్నారు. అయితే అన్నదాతలపై కరుణ చూపని సర్కారు కోతల సీజన్ ప్రారంభమై పక్షంరోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో సిద్దిపేటలోని మార్కెట్‌కు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ దళారులంతా ఏకం కావడంతో వరికి మద్దతు ధర దక్కడం లేదు. ఇంకొన్నిరోజులు ఆగే ఆర్థికబలం లేక కొందరు, వివాహాలు, చదువులు, ఇతర అత్యవసరాల కోసం మరికొందరు రైతులు దళారులు నిర్ణయించిన అడ్డగోలు ధరకే వరిని అమ్మేసుకుంటున్నాడు.

 

 వెల్లువలా ధాన్యం...

 సంసిద్ధం కాని యంత్రాగం

 ఇప్పటికే 40 శాతం వరికోతలు పూర్తికాగా, మిగిలిన పంట మరో వారం రోజుల్లో ఇంటికిచేరే అవకాశం ఉంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంట అంతా సిద్దిపేట మార్కెట్‌కు తరలివస్తోంది. మరో వారం రోజులు తర్వాత సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు వరి ధాన్యం వెల్లువలా రానుంది. సిద్దిపేట ప్రాంతంలోని ఐదు మండలాల్లోనే సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతో పాటు సిద్దిపేట సమీపంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం భారీగా రానుంది. అయికే వచ్చినధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం...

 ఇక్కడి వ్యాపారులు అంత ధాన్యాన్ని కొనుగోలు చేసే స్థితిలో లేకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ఆరుగాలం శ్రమించిపండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top