కార్మికుడిని బలిగొన్న ‘కారుణ్యం’

Heart Attack To Dies Singareni Worker Adilabad - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): విధులు నిర్వహించేందుకు ఆరోగ్యం సహకరించకపోవటంతో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కారుణ్యం దక్కకపోగా చేసే పనిని కాదని సర్ఫేస్‌ జనరల్‌ మజ్దూర్‌గా ఫిట్‌ చేయటంతో తీవ్ర మానసిక క్షోభకు గురై గుండెపోటుతో కార్మికుడు ప్రాణాలు వదిలిన సంఘటన బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో నివాసం ఉండే దొమ్మటి లింగయ్య(56) ఏరియా ఖైరిగూడ ఓసీపీలో కన్వేయర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహించే వాడు. కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యం కారణంగా విధులు నిర్వహించే సత్తువ లేక ఇంకా నాలున్నర సంవత్సరాల సర్వీస్‌ ఉన్నా యాజమాన్యం అవకాశం కల్పించిన కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

దీంతో గత నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్‌ బోర్డుకు వెళ్లగా లింగయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించి అతని అనారోగ్యపరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గనుల్లో పని చేసేందుకు అనర్హుడిగా పేర్కొంటూ సర్వేస్‌ జనరల్‌ మజ్దూర్‌గా ఫిట్‌ చేస్తూ మైన్‌కు రిపోర్ట్‌ పంపించారు. దీంతో గత 18న ఏరియా జీఎం కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కైరిగూడ గని అధికారులు లెటర్‌ సిద్ధం చేశారు. విషయం తెలియని లింగయ్య మంగళవారం విధులు నిర్వహించేందుకు ఖైరిగూడకు వెళ్లి మాస్టర్‌ వేయాలని కోరగా మాస్టర్‌ లాక్‌ అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

అనారోగ్య కారణాలతో కోరుకున్న కారుణ్య నియామకం దక్కకపోగా, కన్వేయర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం నుంచి సర్ఫేస్‌ జనరల్‌ మజ్దూర్‌గా ఫిట్‌ చేశారని తెలుసుకున్న లింగయ్య తీవ్ర మానసిక క్షోభకు గురై అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే వాంతులు కావటంతో హుటాహుటిన అంబులెన్సులో గోలేటి డిస్పెన్సరీకి తరలించిన అధికారులు అపై మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. కాగా మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కార్మికుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

‘సీఎం హామీ అమలులో విఫలం’
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయటంతో సీఎం కేసీఆర్, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ విఫలం కావడంతో కార్మికులు మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువాత పడుతున్నారని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి ఆరోపించారు. కారుణ్య నిమాయకం ద్వారా కార్మికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చిన మెడికల్‌బోర్డులో కార్మికులకు న్యాయం జరగటం లేదన్నారు. అనారోగ్య కారణాలతో విధులకు హాజరుకాలేక మానసికక్షోభను అనుభవిస్తూ కార్మికులు గుండె పగిలి మృతి చెందుతున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ కారుణ్య నియామకాలు అందించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top