చెత్తబండి రోజూ రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడే: హరీష్‌ రావు | Sakshi
Sakshi News home page

చెత్తబండి రోజూ రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడే: హరీష్‌ రావు

Published Tue, Mar 3 2020 1:59 PM

Harish Rao Said Veg And Non Veg Market Would Be Built Soon - Sakshi

సాక్షి, సిద్ధిపేట : ఎండాకాలం వస్తే కరెంట్‌ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్‌ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వృద్ధులకు రెండు వేల పింఛన్‌ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్‌రూమ్  ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం  ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూంలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రి పేర్కొ‍న్నారు.

త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు పని తగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వందల రూపాయల ఫైన్‌ విధిస్తామన్నారు. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడేనన్నారు. పేదవాడు ఇళ్లు కట్టుకుంటే రూపాయి లంచం అవసరం లేదని, తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి నెల రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్‌ రావు మొక్క సంరక్షణ కోసం పదివేల రూపాయలు అందజేశారు.

Advertisement
Advertisement