స్థానిక’ ఖర్చుకు పాత లెక్కే! | Guidelines to Gram Panchayat Elections | Sakshi
Sakshi News home page

స్థానిక’ ఖర్చుకు పాత లెక్కే!

Jun 1 2018 2:35 AM | Updated on Aug 14 2018 4:34 PM

 Guidelines to Gram Panchayat Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈసారి కూడా గత ఎన్నికల తరహాలోనే ప్రచార వ్యయ పరిమితి ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే.. జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులకు గరిష్టంగా రూ.2 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్ష వ్యయ పరిమితి ఉంటుంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విషయంలో రెండు వ్యయ పరిమితులు ఉన్నాయి.

పది వేల కంటే ఎక్కువ జనాభా ఉండే మేజర్‌ గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్‌ అభ్యర్థికి రూ.80 వేలు, వార్డు మెంబర్‌ అభ్యర్థికి రూ.10 వేలు.. సాధారణ గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్‌ అభ్యర్థికి రూ.40 వేలు, వార్డు మెంబర్‌ అభ్యర్థికి రూ.6 వేలు గరిష్ట వ్యయ పరిమితి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇటీవల పది వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా సాధారణ గ్రామ పంచాయతీలే ఉండనున్నాయి.

‘లెక్క’చెప్పకుంటే తిప్పలే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమ ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎన్నిక ముగిసిన 40 రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. ఆ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షార్ట్‌ నోటీసు జారీ చేస్తుంది.

అంటే మరో 20 రోజుల గడువు ఇచ్చి.. వివరాలు సమర్పించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తుంది. ఈ నోటీసు కూడా స్పందించని వారిపై.. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. ఇలా గతంలో కార్పొరేటర్, కౌన్సిలర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్, వార్డు మెంబర్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను చెప్పని 13,329 మందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలోని 8,778 సర్పంచ్, 88,682 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 2014 మార్చిలో తెలంగాణలోని 438 జెడ్పీటీసీ, 6,441 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు వివరాలు చెప్పని వారిపై వేటు పడింది. మూడేళ్ల క్రితమే వేటు పడిన వారు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గత జనవరిలో మూడు వేల మందిపై అనర్హత వేటు వేసింది. వారు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే.

అనర్హత వేటుపడ్డ అభ్యర్థుల సంఖ్య
వార్డు మెంబర్‌           8,528
సర్పంచ్‌                  1,265
ఎంపీటీసీ                 1,279
జెడ్పీటీసీ                    291
కార్పొరేటర్‌/కౌన్సిలర్‌  2,166

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement