పొత్తుపొడుపు!

పొత్తుపొడుపు! - Sakshi

  •      కాంగ్రెస్- ఎంఐఎంల హైడ్రామా

  •      ఆమోదం పొందని మేయర్ మాజిద్ రాజీనామా!

  •      జీహెచ్‌ఎంసీ సమావేశంలో నాటకీయ పరిణామాలు

  •      రాజీనామాను అంగీకరించమన్న కాంగ్రెస్, ఎంఐఎంలు

  •      అదే బాటలో టీడీపీ, బీజేపీ

  •  సాక్షి, సిటీబ్యూరో :  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్- ఎంఐఎంలు పొత్తు పెట్టుకోనున్నాయా..? శనివారం జీహెచ్‌ఎంసీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ ఈ నెల 7న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాని ఆమోదం పొందేందుకు మేయర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆద్యంతం నాటకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్ రాజీనామాను సమావేశం ఆమోదించలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సమావేశం.. చాలాసేపటి వరకు ప్రారంభం కాలేదు.



    విశ్వసనీయ సమాచారం మేరకు.. మేయర్ రాజీనామాను ఆమోదించవద్దంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కాంగ్రెస్ ముఖ్యులకు, ఇటు ఎంఐఎం అధిష్టానం నుంచి ఎంఐఎం ముఖ్యులకు ఫోన్లు వచ్చాయి. దీంతో మేయర్ చాంబర్‌లో మాజిద్‌హుస్సేన్(ఎంఐఎం), డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్(కాంగ్రెస్)లతోపాటు ఎంఐఎం ముఖ్యులు, కాంగ్రెస్ ముఖ్యులు దాదాపు గంటన్నరపాటు చర్చించారు. తర్జనభర్జనలు పడ్డారు.



    దీనికి  ముందు సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి తాను ప్రసంగిస్తానని, తన హయాంలో చేసిన పనుల గురించి వివరిస్తానని మేయర్ అధికారులకు చెప్పడంతో.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కుదరదని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. ఒకవేళ మేయర్ మాట్లాడితే అనర్హతవేటు పడుతుందని కమిషనర్ చెప్పినట్లు తెలిసింది. ఈ తతంగం జరుగుతుండగానే ఆయా అధిష్టానాల నుంచి ఫోన్లు వచ్చాయి.



    రెండు పార్టీల నేతల చర్చలు ముగిశాక ఎట్టకేలకు 12.05 గంటలకు మేయర్ సమావేశం హాల్లోకి వచ్చారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు లేచి రాజీనామాను అంగీకరించమన్నారు. ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆమోదించలేదు కనుక తాము కూడా అంగీకరించబోమన్నారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్‌నుద్దేశించి మాట్లాడుతూ.. మీ రాజీనామాకు కారణాలేంటో చెప్పాలంటూ పట్టుబట్టారు.



    జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌తో మీకున్న సంబంధాలు దెబ్బతిన్నాయా? మరేదైనా కారణం ఉందా? అసలెందుకు రాజీనామా చేస్తున్నారో తమకు తెలియాలన్నారు. ఇప్పుడు రాజీనామాను ఆమోదిస్తే.. ఎన్నికల కోడ్ ఉన్నందున మరో రెండు నెలల దాకా కొత్త మేయర్ ఎన్నిక జరగదని, ఆలోగా నగరం పరమ అధ్వానంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు మేయర్ స్పందిస్తూ తన రాజీనామా లేఖలోనే రాజీనామాకు కారణం తెలిపానని చెబుతుండగా.. టీడీపీ సభ్యులు లేచి అరవడంతో గందరగోళం నెలకొంది.



    ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు జీహెచ్‌ఎంసీ బాధ్యతలు నిర్వహించేదెవరంటూ ప్రశ్నించారు. టీడీపీతో పాటు బీజేపీ ఫ్లోర్‌లీడర్ బంగారి ప్రకాశ్, ఆ పార్టీ సభ్యులు సైతం లేచి రాజీనామాకు కారణం కావాలంటూ పట్టుబట్టారు. తీవ్ర గందరగోళం మధ్యే మేయర్ తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతూ ప్రకటన చేశారు. ఆయన అది చదువుతుండగానే టీడీపీ, బీజేపీ పక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎంలు అంగీకరించనందున తన రాజీనామాను సర్వసభ్య సమావేశం ఆమోదించలేదని ప్రకటించి సభను ముగించారు.

     

    మారిన రాజకీయం

     

    శనివారం ఉదయం వరకు మేయర్ మాజిద్ రాజీనామా ఆమోదం పొందుతుందనే అందరూ భావించారు. సభ ముగియగానే మేయర్‌తో కలిసి సభ్యులందరు గ్రూప్ ఫొటో దిగడానికి వీలుగా కుర్చీలు, తదితర ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు అరగంటలో సమావేశం ముగుస్తుందని, రాజీనామా ఆమోదానంతరం గ్రూప్ ఫొటో దిగాలని భావించారు. కానీ.. కాంగ్రెస్- ఎంఐఎంల ఆదేశాల మేరకు నిర్ణయం మార్చుకున్నారు. ఆ విషయం తెలిసిన టీడీపీ, బీజేపీలు.. అది తమ ఘనతగా చెప్పుకునేందుకు రాజీనామాను అంగీకరించబోమని వ్యాఖ్యానించాయి. మొత్తానికి తీవ్ర హైడ్రామా నడుమ మేయర్ రాజీనామా ఆమోదానికి నోచుకోకుండా వీగిపోయింది.

     

     హై డ్రామా

     త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కోసమే.. కాంగ్రెస్, ఎంఐఎంలు ఈ హైడ్రామా నడిపించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం.. టీఆర్‌ఎస్‌తో జతకడితే, హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోనూ తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన చెందిన కాంగ్రెస్ అధిష్టానం పావులు కదిపి ఎంఐఎంతో చర్చలు నెరిపినట్లు సమాచారం. కాంగ్రెస్- ఎంఐఎంలకు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మైత్రీబంధం ఉండటం తెలిసిందే.



    మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనే విభేదాలు తప్ప ఎంఐఎంకు కాంగ్రెస్‌తో సత్సంబంధాలే ఉన్నాయి. కిరణ్ వైఖరి వల్లే  కాంగ్రెస్‌కు మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఎంఐఎం కొద్దికాలం క్రితం ప్రకటించింది. అయినప్పటికీ, జీహెచ్‌ఎంసీలో మాత్రం రెండు పార్టీల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.  ఒప్పందం మేరకే.. కాంగ్రెస్ అభ్యర్థికి మేయర్ పదవి దక్కడానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు మాజిద్ రాజీనామా రోజున ప్రకటించారు.



    మాజిద్ రాజీనామా  ఆమోదం పొందాక మేయర్ పదవి పొందేందు కోసం కాంగ్రెస్‌లోని పలువురు కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. కాగా, ఎంఐఎంతో సఖ్యతను కొనసాగించాలని  కాంగ్రెస్ అధిష్టానం భావించడంతోపాటు నగరానికి చెందిన ఇద్దరు మంత్రులకు సైతం ఎంఐఎంతో సత్సంబంధాలే ఉన్నాయి. ఎంఐఎంతో చెడితే తమ గెలుపు కూడా కష్టమవుతుందనే తలంపుతో వారు సైతం తమవంతు పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.



    రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే.. గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ సీట్లకుగాను 22 సీట్ల దాకా గెలుచుకోవచ్చునని కూడా అంచనాలు వేసినట్లు సమాచారం. వీటన్నింటి దృష్ట్యా.. మేయర్ రాజీనామాను ఆమోదించరాదని అభిప్రాయపడినట్లు తెలిసింది.   ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి మేయర్ పదవి కట్టబెట్టాలనుకుంటే.. జూన్ తర్వాత ఆ అంశం ఆలోచించవచ్చుననే తలంపుతోనే మేయర్ రాజీనామాను అడ్డుకున్నట్లు సమాచారం.

     

    మాజిద్ పోటీపై అయోమయం..

    అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకోసమే మాజిద్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారని వివిధ పార్టీలు భావించాయి. అనూహ్యంగా మాజిద్ రాజీనామాకు కౌన్సిల్ ఆమోదం లభించకపోవడంతో, ఆయన అసెంబ్లీకి పోటీచేయబోరనే ప్రచారం జరిగింది. మరోవైపు మేయర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దింపుతారని అంచనా వేసినవారు కూడా ఉన్నారు.  మొత్తానికి  అసెంబ్లీ/ లోక్‌సభ ఎన్నికల్లో మాజిద్ అభ్యర్థి కానున్నారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top