బదిలీల టెన్షన్‌! 

Govt Officers Tensions With Transfers In Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో ఆరునెలలకు పైగా కొనసాగిన ఎన్నికల కోడ్‌ ఇటీవలే ముగిసింది. కోడ్‌ నేపథ్యంలో ఎన్నికల ముందు బదిలీలు అయిన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల క్రితమే వారి వారి పూర్వస్థానాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని స్పష్టమవుతోంది. పలు ప్రభుత్వ విభాగాల ప్రక్షాళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో పై స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్‌ అధికారుల వరకు స్థాన చలనం తప్పదని
తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతోపాటు జిల్లా స్థాయి ముఖ్య అధికారులు పలువురు బదిలీలకు సిద్ధమవుతున్నారు.

సెలవులో కలెక్టర్, కమిషనర్‌
ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని స్పష్టం కావడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యే ఉన్నారు. కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సాధారణంగా జరిగే బదిలీల్లో భాగంగా వీరికి స్థాన చలనం తప్పనిసరి. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వీరి బదిలీ జరుగుతుందని ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు సాగాయి. ఈ మేరకు వారు కూడా అందుకు సిద్ధపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు వ్యక్తిగత పనులపై సెలవుల్లో వెళ్లిపోయారు. కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఈ నెల 16 వరకు సెలవులోనే ఉండడం గమనార్హం. ఈ లోపు బదిలీల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఐజీ, డీఐజీ సైతం..
కరీంనగర్‌ రేంజ్‌ ఐజీ వై.నాగిరెడ్డి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు ఐజీగా వ్యవహరిస్తున్నారు. నార్త్‌ జోన్‌ పరిధిలోని వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌లకు ఆయనే ఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో నాగిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు ఇటీవలే ఐజీగా పదోన్నతి లభించింది. ఆయనను ఐజీగా ఏదైనా జోన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

మిగతా జిల్లాల్లో సైతం...
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా తిరిగి పాత స్థానానికి వచ్చిన కృష్ణ భాస్కర్‌ను కొనసాగిస్తారా? సాధారణ బదిలీల్లో మారుస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. సిద్దిపేట ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బదిలీ చేసినప్పటికీ, సిరిసిల్లకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సిరిసిల్ల ఎస్‌పీ రాహుల్‌ హెగ్డే బదిలీ అయి ఏడాది కూడా పూర్తి కానందున అక్కడే కొనసాగవచ్చు. ఇక జగిత్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుంచి కలెక్టర్‌గా కొనసాగుతున్న శరత్‌కు ఈసారి స్థాన చలనం తప్పనిసరి. ఇక్కడ ఎస్‌పీగా సింధూశర్మ బాధ్యతలు స్వీకరించి కూడా ఏడాది పూర్తి కాలేదు. అయితే సింధూశర్మ భర్త శశాంక జోగులాంబ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆమె హైదరాబాద్‌ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ గత సంవత్సరమే బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చని సమాచారం. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, కలెక్టర్‌ శ్రీదేవసేన సైతం వచ్చి ఏడాది కూడా కానందున వీరిని యథాస్థానాల్లో కొనసాగించే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అన్ని జిల్లాల్లోని డీఆర్‌ఓ, ఆర్‌డీవో, ఇతర శాఖల్లోని కీలకస్థానాల్లో ఉన్న అధికారులకు సైతం బదిలీ వేటు తప్పదని, ఈ మేరకు పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

రాష్ట్ర స్థాయి బదిలీల తరువాతే జోన్‌లలో..
రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల  ప్రక్రియ పూర్తయిన తరువాతే జిల్లా స్థాయిల్లో అధికారుల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐజీ, డీఐజీ నుంచి కమిషనర్‌ల వరకు బదిలీల జాబితాలో ఉన్నందు వల్ల కొత్త అధికారులు వచ్చిన తరువాత పోలీస్‌ శాఖలోని ఏసీపీ తరువాత స్థాయి అధికారులను మార్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లోని జిల్లా కేంద్రాల్లో, కొన్ని మండలాల్లో సీఐ, ఎస్‌ఐ స్థాయిల్లో బదిలీలన్నీ వీరి నేతృత్వంలోనే జరుగుతాయి. కరీంనగర్‌లో కోరుకున్న స్థానాలకు బదిలీ కావాలని కొందరు సీఐలు ప్రయత్నిస్తున్నప్పటికీ,  కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి వేచిచూసే ధోరణితోనే ఉన్నట్లు సమాచారం. మండలాల్లో తహసీల్ధార్లు, ఎంపీడీవోల బదిలీలకు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు లింక్‌ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలపై అధికార యంత్రాంగంలో టెన్షన్‌ పెరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top