అందరికీ అందుబాటులోకి వైద్యం

Governor Esl Narasimhan Visit HICC In Hyderabad - Sakshi

సాంక్రమిక వ్యాధుల కట్టడికి కృషి చేయాలి

శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సూచన

16వ బయో ఆసియా సదస్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికంగా ఎంత ఎదుగు తున్నా, ఆరోగ్య వ్యవస్థలను ఆధునికీకరించుకుంటున్నా.. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇటీవలి కాలంలో సాంక్రమిక వ్యాధులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వ్యాఖ్యానించారు. వీటిని ఎంత మేరకు అరికట్టగలిగామో శాస్త్రవేత్తలు పరిశీలించాలని పిలుపునిచ్చారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, నగరీకరణ, అడవుల నాశనం, వాతావరణ మార్పు లు తదితర కారణాల వల్ల సాంక్రమిక వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం ప్రారంభమైన 16వ బయో ఆసియా సదస్సుకు గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ భవిష్యత్‌లో పెనుముప్పుగా పరిణమించగల వ్యాధుల జాబితాను సిద్ధం చేసిందని, ఏటా దీన్ని సవరిస్తుందన్నారు. ఇది ప్రజల్లో ఆందోళన పెంచేందుకు కాకుండా ఏఏ అంశాలపై పరిశోధనలను ఎక్కువ చేయాలో సూచించేందుకు మాత్రమేనని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ, వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలకు ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగానికీ కొన్ని నైతిక సూత్రాలు ఉండాలని సూచించారు. సామాన్యులకు అందుబాటులో లేనంతగా వైద్యానికి ఖర్చు ఉండటం సరికాదన్నారు. సామాన్యుడి సమస్యలు కేంద్రంగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వైద్య పద్ధతులు, చిట్కాలను అందు బాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  

డాక్టర్‌ డాన్‌క్లీవ్‌ల్యాండ్‌కు అవార్డు..
కేన్సర్‌ జెనెటిక్స్‌తోపాటు నాడీ సంబంధిత వ్యాధులపై విస్తృత పరిశోధనలు చేసిన లడ్‌విగ్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ డాన్‌ క్లీవ్‌ల్యాండ్‌కు బయో ఆసియా–2019 ‘జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు’దక్కింది. గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించడంపై క్లీవ్‌ల్యాండ్‌ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, దక్షిణ కొరియా కాన్సులేట్‌ జనరల్‌ సురేశ్‌ చుక్కపల్లి, అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరీన్‌ హడ్డా తదితరులు పాల్గొన్నారు.   

త్వరలో లైఫ్‌ సైన్సెస్‌ గ్రిడ్‌ ఏర్పాటు..
జీవశాస్త్ర రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అత్యున్నత కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. దీనిలో భాగంగానే జినోమ్‌ వ్యాలీ 2.0 ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఫార్మా సిటీ, వైద్య పరికరాల తయారీ పార్క్, బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బీ–హబ్‌ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జీవశాస్త్ర రంగంలోని అన్ని వర్గాల వారికి వేదికగా పనిచేసేందుకు త్వరలోనే లైఫ్‌ సైన్సెస్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధితోపాటు, ఉద్యోగ కల్పన, పెట్టుబడుల విషయంలో సహాయం అందించడం ఈ గ్రిడ్‌ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top