విద్యార్థులను గెంటేసి.. పాఠశాలను గోశాలగా మార్చారు

Government School Turned Into Gaushala In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బడిలో చదువుకుంటున్న పేద పిల్లలను ఖాళీ చేయించి దాన్ని గోశాలగా మార్చేశారు నగరానికి చెందిన వీరాంజనేయ స్వామీ మందిర్‌ కమిటీ సభ్యులు. నివ్వెర పోయే ఈ సంఘటన ఉప్పుగూడలోని అరుంధతి కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. జనవరిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలతను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు, కొన్ని రోజుల కోసం పాఠశాలను గుడి అవసరాలకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

దాని కోసం కొన్ని రోజులు బడిని వేరే చోటికి బదిలీ చేయాల్సిందిగా సూచించారు. ఆలయ పనుల కోసం అడుగుతున్నారు కదా అని ప్రధానోపాధ్యాయురాలు పద్మ వారి వినతిని అంగీకరించారు. జనవరి 21న పాఠశాలను అరుంధతి కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేషా నగర్‌కు మార్చారు. పద్మలత వారికి నాలుగు నెలల గడువు ఇచ్చారు. ఆలోపు అన్ని పనులు పూర్తి చేసుకుని పాఠశాలను తిరిగి అప్పగించాల్సిందిగా ఆలయ కమిటీకి తెలిపారు.

నాలుగు నెలల తర్వాత పాఠశాల గోశాలగా మారడాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆశ్చర‍్యపోయారు. ఇదేంటని ఆలయ కమిటీని ప్రశ్నించగా ఈ స్థలం తమదేనంటూ ఆమెపై దూషణకు దిగారు కమిటీ సభ్యులు. ఏప్రిల్‌ 11న పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి ఆమె నిరసన తెలిపిన ఫలితం లేకుండా పోయింది. ఆలయ కమిటీకి చెందిన ఒక సభ్యుడు దీనిపై స్పందిస్తూ.. ఈ స్థలం ఆలయానికి సంబంధించిందని, ప్రభుత్వ అధికారులు పాఠశాల కోసం మమ్మల్ని సం‍ప్రదించినప్పుడు కమిటీ హాలును వారికి ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇదే విషయమై స్పందించిన ఎంఈఓ, ప్రస్తుత గోశాల ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని, దానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 1999 నుంచి ఇక్కడ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆలయ సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనే బోర్డును కూడా పెట్టించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top