11వ తేదీన నిరసన దీక్ష 

Government ignored the confusion of inter consequences - Sakshi

ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై ప్రభుత్వం నిర్లక్ష్యం

విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

కోదండరాం, చాడ, రావుల, వినోద్‌రెడ్డి డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్టు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో అనేక అవకతవకలు బయటపడి 18 రోజులు గడిచినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆదివారం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో ఇంటర్‌ పరీక్షల వ్యవహారంపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించిన అనంతరం చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎం.కోదండరాం (టీజేఎస్‌), రావుల చంద్రశేఖరరెడ్డి (టీడీపీ), ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డి (కాంగ్రెస్‌) విలేకరులతో మాట్లాడారు. అన్ని జవాబు పత్రాలను సమీక్షించి, అవసరమైతే పునఃమూల్యాంకనం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తప్పిదాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ప్రధానమైన ఐదు డిమాండ్లపై 11న దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

అఖిలపక్ష నేతలని అరెస్ట్‌లు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. బాధిత విద్యార్థుల కుటుంబాలతో కలిసి 11న చేపడుతున్న నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, బోర్డు తప్పిదాలకు కారకులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌లో ఏమాత్రం చలనం లేదని రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. గతంలో రూ.74 లక్షలకే టెండరిచ్చి ఈ ఏడాది మాత్రం దానిని రూ.4.34 కోట్లకు పెంచి గ్లోబరీనాకు ఎవరు అప్పగించారనే దానిపై విచారణ జరిపించాలని వినోద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తాము చేయని తప్పులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top