అన్ని వైరస్‌లకు ఒకేచోట చికిత్స

Government Decides To Treat All Viruses At One Place By Clean Word Centres - Sakshi

అంతర్జాతీయ సౌకర్యాలతో ‘క్లీన్‌ వార్డ్‌’ 

రూ.132 కోట్లతో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం

ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల్లో నెలకొల్పే అవకాశం

స్వైన్‌ఫ్లూ, కరోనా, ఎబోలా, నిఫా వైరస్‌లన్నిటికీ ఇక్కడే చికిత్స 

ప్రస్తుతం ఢిల్లీ, పుణేల్లో మాత్రమే ఇటువంటి కేంద్రాలు  

సాక్షి, హైదరాబాద్‌ : ఏ వైరస్‌ సోకినా ఒకేచోట వైద్య చికిత్స అందించే ‘క్లీన్‌ వార్డు’ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా, తర్వాత దాన్ని ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

డబ్లూహెచ్‌వో మార్గదర్శకాల మేరకు..
క్లీన్‌వార్డు కేంద్రంలో స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్స అందిస్తారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నెలకొల్పుతారు. ప్రస్తుతం ఏదైనా వైరస్‌ సోకితే గాంధీ, ఫీవర్, చెస్ట్‌ ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కోసారి కనీస వసతులు కూడా ఉండకపోవడంతో బాధితులు ఆయా ఆస్పత్రులకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. పైగా ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు వైద్యం అందించే వార్డులనే వైరస్‌లు సోకిన వారికి ప్రత్యేకంగా కేటాయించి చికిత్స చేస్తున్నారు. దీనివల్ల సాధారణ రోగులకు, వైరస్‌ సోకిన రోగులకు పక్కపక్కనే చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీ, పుణేల్లో మాత్రం ఉండగా, త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

మూడు రకాల వార్డులు..
ఈ క్లీన్‌వార్డు కేంద్రంలో ప్రొటోకాల్‌ ప్రకారం చికిత్స అందిస్తారు. క్రిటికల్‌ కేర్, ఐసోలేషన్, సాధారణ వార్డులుంటాయి. క్రిటికల్‌ కేర్‌లో 20 పడకలుంటాయి. ఐసోలేషన్‌ వార్డులో 50 నుంచి 60 పడకలు, సాధారణ వార్డులో దాదాపు 100 పడకలుండేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. వాటితోపాటు వైద్య సిబ్బందికి ప్రత్యేక గదులుంటాయి. ఏదైనా వైరస్‌ సోకిన వ్యక్తి ఆయా కేంద్రానికి వస్తే సాధారణ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి ఐసోలేషన్‌ వార్డు లేదా క్రిటికల్‌ వార్డుకు పంపిస్తారు. స్వైన్‌ఫ్లూ, కరోనా లాంటి వైరస్‌లు సోకితే ముందుగా సాధారణ వార్డుకు పంపించి పరీక్షలు చేస్తారు. అక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి ఐసోలేషన్‌ లేదా క్రిటికల్‌ వార్డులకు తరలిస్తారు. ఎబోలా, నిఫా వంటి వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ వైరస్‌ లక్షణాలున్న వ్యక్తిని నేరుగా క్రిటికల్‌ కేర్‌ వార్డులకు పంపిస్తారు. అంతేగాకుండా ఒక వార్డు నుంచి ఒక వార్డుకు వెళ్లడానికి ముందు అత్యంత శుభ్రంగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. అలాగే మాస్క్‌లు, పూర్తిస్థాయి గౌన్లు ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమిస్తారు. నిష్ణాతులైన వారి ద్వారా చికిత్స అందిస్తారు. ఈ కేంద్రంలోనే వైరస్‌లకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతుంటాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top