‘స్థానిక’ పగ్గాలు అదనపు కలెక్టర్లకే..

Government clarity on the performance of duties - Sakshi

విధుల నిర్వహణపై సర్కారు స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా సృష్టించిన అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు) విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను పూర్తిగా వీరికి కట్టబెట్టింది. మండల, జిల్లా పరిషత్‌ మినహా గ్రామ పంచాయతీలు, పురపాలికలపై పూర్తిస్థాయి అజమాయిషీ అప్పగించిన ప్రభుత్వం.. విధానపరమైన నిర్ణయాలు, సిబ్బంది, పాలకవర్గాలపై చర్యలు తీసుకునే అధికారం మాత్రం కలెక్టర్లకు సంక్రమింపజేసింది. మండల, జిల్లా పరిషత్‌లు ప్రస్తుతం ఉన్న తరహాలోనే జిల్లా పరిషత్‌ సీఈవో పర్యవేక్షణలో పనిచేస్తాయి.

పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి రోజూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో పర్యటించాలని జాబ్‌ చార్ట్‌ లో పొందుపరిచింది. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు రానప్పటికీ, మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్‌ ఈ మేరకు వెల్లడించినట్లు తెలిసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ బాధ్యతలను వీరికి అప్పగించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరపడం వరకే పరిమితం చేసిన ప్రభుత్వం.. చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. ఇకపై పంచాయతీ కార్యదర్శి మొదలు డీపీవో, మున్సిపల్‌ కమిషనర్లు కూడా అదనపు కలెక్టర్‌ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.

కలెక్టరంటే రాజమణిలా ఉండాలి... 
పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను ఆకళింపు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ‘నా చిన్నతనంలో రాజమణి అనే కలెక్టర్‌ ఉండేవారు. ఆయనకు ప్రజలు దండం పెట్టేవారు. ఆయన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మీరు కూడా వినూత్నంగా పనిచేసి గొప్ప అధికారిగా రాణించాలి’అని సీఎం సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top