ముషారఫ్‌.. హ్యాట్సాఫ్‌ | GHMC Commissioner Traveling To Bicycle On Daily Office | Sakshi
Sakshi News home page

ముషారఫ్‌.. హ్యాట్సాఫ్‌

Jul 20 2018 10:58 AM | Updated on Sep 4 2018 5:53 PM

GHMC Commissioner Traveling To Bicycle On  Daily Office - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆయనో యువ ఐఏఎస్‌ అధికారి.. హైదరాబాద్‌కు చెందినవాడు.. పేరు ముషారఫ్‌ ఫారూఖీ.. పక్కా లోకల్‌. ఆర్నెల్ల క్రితం బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చారు. గ్రేటర్‌ ఐటీ విభాగం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. ఆ విభాగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘మైజీహెచ్‌ఎంసీ యాప్‌’ ఆధునికీకరణ, వివిధ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులన్నీ ఒకే చోటకు చేర్చడం.. సంబంధిత అధికారులకు వెంటనే వెళ్లడం వంటి మార్పులు తీసుకు వచ్చారు. ట్విట్టర్‌ ద్వారా అందే ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపడంతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులంతా ట్విట్టర్‌ను ఫాలో అయ్యేలా ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడాయన పర్యావరణంపై దృష్టి పెట్టారు.

జూన్‌ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో పర్యావరణ పరిరక్షణకు ఏదైనా చేయాలని తలంచారు. ఇతరులకు చెప్పే ముందు తాను ఆచరించాలని.. కార్యాలయానికి కారు బదులు సైకిల్‌ సవారీని ఎంచుకున్నారు. వారంలో ఒకరోజు సైకిల్‌పైనే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వస్తూ.. తిరిగి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. నెలరోజులుగా దీన్ని ఆచరిస్తున్న ఫారూఖి ఇంటికి, కార్యాలయానికి మధ్య 8 కి.మీ. దూరం సైకిల్‌పై 25 నిమిషాల్లో రాగలగుతున్నానన్నారు. జపాన్, సింగపూర్‌ వంటి దేశాల్లో బస్‌/రైల్వే స్టేషన్ల వరకు రెండు కిలోమీటర్ల మేర నడుస్తారని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికీ మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటి పరిస్థితి వస్తే మంచిదన్నారు. తనలాగే జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా సైకిల్‌ను వినియోగించాలని కోరుతున్నారు. ఇందుకు త్వరలోనే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సైకిల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

సైక్లింగ్‌ క్లబ్‌ సహకారంతో..
ముషారఫ్‌ ఆసక్తిని చూసిన హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సైకిల్‌స్టేషన్‌ ఏర్పాటుకు ఉత్సాహం చూపింది. తొలుత డెకథ్లాన్‌ కంపెనీకి చెందిన పది సైకిళ్లతో ఈ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సైకిల్‌ ఖరీదు రూ.14వేలు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులెవరైనా సరే.. ఐటీ విభాగంలో పేరు నమోదు చేయించుకుంటే, సైకిల్‌తో పాటు హెల్మెట్‌ ఉచితంగా అందిస్తారు. వినియోగాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం రోజుల వరకు కూడా ఇస్తామని ముషారఫ్‌ తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ సైకిల్‌స్టేషన్‌ అందుబాటులోకి రానుంది. సైకిల్‌ వాడకం అలవాటైతే క్రమేపీ కొనుక్కునేందుకు కూడా వెనుకాడరని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో చాలా మంది సైకిళ్లు వాడుతున్నారని, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ సైక్లింగ్‌క్లబ్‌ బ్రాండింగ్‌తో అందుబాటులోకి తేనున్న వీటికి తగిన ప్రచారం కల్పిస్తే ఎక్కువ మంది వాడతారని అభిప్రాయపడ్డారు. ఎప్పటినుంచో కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఈయన్ను.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ సెల్‌ అధికారిగానూ నియమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement