ఉమ్మినందుకు రూ.100 ఫైన్‌

GHMC Challans on Splitting on Roads in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఇటీవలి కాలంలో వివిధ కార్యక్రమాలు చేపట్టి జరిమానాలు విధిస్తోన్న జీహెచ్‌ఎంసీ.. తాజాగా బుధవారం లింగంపల్లి వద్ద  ఆర్టీసీ బస్‌డ్రైవర్‌ రోడ్డుపై ఉమ్మివేయడంతో  రూ.100 జరిమానా విధించింది. కోఠి నుంచి పటాన్‌చెరు వెళ్తున్న కుషాయిగూడ ఆర్టీసీ డిపోబస్‌ (ఏపీ 28జడ్‌ 3676) లింగంపల్లి బస్‌బే వద్ద కొద్దిసేపు ఆగింది. ఈ సమయంలో బస్‌ డ్రైవర్‌ జగదీష్‌ రోడ్డుపై ఉమ్మివేశారు. దాంతోపాటు  బస్‌లోంచి కొన్ని కాగితాలు కూడా అక్కడ వేశారు.

సదరు దృశ్యాలను ఫొటోలు తీసిన జీహెచ్‌ఎంసీ పటాన్‌చెరు సర్కిల్‌ సిబ్బంది ఉమ్మివేశారా? అని అడగడంతో అవునని బదులివ్వడంతో రూ.100 జరిమానా వసూలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నందున ఇలాంటివి చేయరాదంటూ సదరు బస్‌బేలో ఉన్న వారందరికీ సూచించారు. తమ సిబ్బంది కొద్దిసేపటి క్రితమే శుభ్రం చేసిన ప్రాంతాన్ని ఉమ్మివేసి పాడు చేయడంతో జరిమానా విధించినట్లు శానిటరీ సూపర్‌వైజర్‌ గోపాల్‌రావు పేర్కొన్నారు. జరిమానా విధించే దృశ్యాల్ని జీహెచ్‌ఎంసీ పోస్ట్‌చే యడంతో సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారింది. దీంతోపాటు చదువుకోని వాడు రోడ్లు శుభ్రం చేస్తే.. చదువుకున్నవాడు పాడు చేస్తున్నాడని చెబుతూ కొన్ని ఫోటోలు పోస్ట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top