దీపం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము | Sakshi
Sakshi News home page

పేదింట్లో దీపం

Published Fri, Apr 3 2020 7:51 AM

Gas Refill Money Deposit in Deepam Scheme Account Holders - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం వంటగ్యాస్‌ లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో ఉచిత సిలిండర్‌ (రీఫిల్‌) సొమ్ము జమ కానుంది. ముందస్తుగా బ్యాంక్‌ ఖాతాలో జమ అయిన నగదును వినియోగించుకొని వంట గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు నెలల పాటు మార్కెట్‌ రీఫిల్‌ ధరను బట్టి నగదు బదిలీ జరగనుంది. మొదటి నెల బ్యాంక్‌ ఖాతాలో పడిన నగదును వినియోగించుకుని సిలిండర్‌ కొనుగోలు చేస్తేనే మరుసటి నెల రీఫిల్‌ నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. వాటిని వినియోగించుకొని రెండో నెల రీఫిల్‌ కొనుగోలు చేస్తేనే మూడో నెల నగదు బదిలీ కానుంది. కేంద్ర ప్రభుత్వం రీఫిల్‌ ధర మొత్తం నగదు బదిలీతో లబ్ధిదారులకు ముందస్తుగానే అందిస్తుండటంతో సబ్సిడీ సొమ్ము ప్రసక్తి ఉండదు. సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ పక్రియ యథాతథంగా ఉంటుందని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉజ్వల యోజన పథకం కింద హైదరాబాద్‌ మహా నగరంలోని సుమారు 84,710 పేద కుటుంబాలకు మాత్రమే ఉచిత వంట గ్యాస్‌ లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతా ఇన్‌ యాక్టివ్‌లో ఉంటే మాత్రం నగదు బదిలీ వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

గ్రేటర్‌లో 28 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు...
గ్రేటర్‌ పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన సుమారు 28 లక్షల ఎల్పీజీ గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో పేద కుటుంబాలు 18 లక్షల వరకు ఉంటాయి. అధికార గణాంకాల ప్రకారం  మూడు జిల్లాల పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలు సుమారు 16 లక్షలకుపైగా ఉండగా అందులో కేవలం 84వేల పైచిలుకు కుటుంబాలకు మాత్రమే ఉజ్వల యోజన (దీపం) పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా మూడేళ్ల క్రితం ప్రతి ఇంట వంట గ్యాస్‌ ఉండాలన్న కేంద్రప్రభుత్వ ఆదేశాలతో  పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు కలిగి వంట గ్యాస్‌ కనెక్షన్లు లేని సుమారు రెండు లక్షల కుటుంబాల్లో 1.65 లక్షల పైచిలుకు కుటుంబాలను గుర్తించి.. ఉజ్వల యోజన పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు దాదాపు 98 శాతం వరకు ఉజ్వల యోజన పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్ల ప్రొసీడింగ్‌ ఆర్డర్స్‌ అందించి చేతులు దులుపుకొన్నారు. తదుపరి పర్యవేక్షణ కొరవడటంతో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్లక్ష్యంతో కేవలం 84వేల పైచిలుకు కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. మూడేళ్లుగా దీపం కనెక్షన్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 

Advertisement
Advertisement