‘గాంధీ’లోఅంతే!

Gandhi Hospital Staff Neggligance - Sakshi

ఫ్యాన్లు తిరగవ్‌.. ఏసీలు పనిచేయవ్‌

‘గాంధీ’లో ఉక్కపోతతో తల్లడిల్లుతున్న రోగులు

అసలే వేసవి. మండుతున్న ఎండలు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్‌. ఈ పరిస్థితిలో ఫ్యాన్లు, ఏసీలు లేకుంటే మామూలు వ్యక్తులే ఉక్కపోతతో అల్లాడే పరిస్థితి. అలాంటిది ఇక జబ్బులతో బాధపడుతున్న రోగులకు కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం దారుణం. ఈ దుస్థితి ప్రస్తుతం ప్రఖ్యాత గాంధీ ఆస్పత్రిలో నెలకొంది. మండు వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయక ఇక్కడ రోగులు నానా యాతనపడుతున్నారు. వీరి బాధల్ని పట్టించుకునే వారే లేరు.

గాంధీఆస్పత్రి: ఒక పక్క సూర్యుడి ప్రతాపం.. మరో పక్క అధికారుల నిర్లక్ష్యం.. వెరసీ రోగులు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్రాను. గాంధీ ఆస్పత్రిలో ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో తల్లడిల్లుతున్నారు. గాంధీ ఆస్పత్రిలోని పలు విభాగాల్లో 328 ఏసీలు ఏర్పాటు చేయగా వాటిలో సింహభాగం పనిచేయడంలేదు. ఓపీ, అత్యవసర, ఇన్‌ పేషెంట్‌ వార్డుల్లో ఉన్న 1,247 ఫ్యాన్లలో సగానికి పైగా మరమ్మతులకు గురయ్యాయి. ఎండాకాలంతో పాటు నిరుపేద రోగులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలోనే ఏసీలు, ఫ్యాన్లు మరమ్మతులు చేయించేందుకు ఆస్పత్రి పాలన యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్‌ నెల వచ్చినప్పటికీ ఇంతవరకు మరమ్మతులకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పా లన యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోం దని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుక్కపట్టి ఏడుస్తున్న శిశువులు..హాహాకారాలు చేస్తున్న బర్న్స్‌వార్డు రోగులు
ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలోని స్టెప్‌డౌన్‌ వార్డు ఎన్‌ఐసీయూ, పీఐసీయూల్లో ఏసీలు పని చేయకపోవడంతో శిశువులు, చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. వార్మర్ల వేడితోపాటు ఇతర పరికరాల నుంచి వెలువడే ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఈ వార్డులో ఏసీలు తప్పనిసరి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏసీలు కొన్నేళ్లుగా పనిచేయడంలేదని, దీంతో శిశువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిబ్బందితోపాటు చిన్నారుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గైనకాలజీ లేబర్‌వార్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బర్న్స్‌ వార్డులోని రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ వార్డుల్లో కూడా ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో కాలిన గాయాలతో బాధకు తాళలేక హాహాకారాలు చేసున్న రోగులకు వారి సహాయకులే పేపర్లు, అట్టలతో గాలి విసురుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. అత్యవసర విభాగాలతోపాటు ఆపరేషన్‌ థియేటర్లు, రౌండ్‌ ది క్లాక్‌ సేవలు అందించే డ్యూటీ డాక్టర్ల గదుల్లోని ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. ఆస్పత్రి పాలన యంత్రాంగానికి పలుమార్లు సమాచారం అందించినా ఫలితం లేకపోయిందని వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎలక్ట్రీషియన్‌ ఒకే ఒక్కడు..
మినీ గ్రామాన్ని తలపించే గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్‌ అందుబాటులో ఉండడం గమనార్హం, గ్రేడ్‌ వన్‌ కేటగిరీలో ఒక ఎలక్ట్రీషియన్, గ్రేడ్‌ టూలో మరో ఇద్దరు ఎలక్ట్రీషియన్‌ పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టులో పనిచేసేవారు పదవీ విరమణ పొందడం, నూతన నియామకాలు చేపట్టకపోవడంతో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌ ఒక్కరే అందుబాటులో ఉంటున్నాడు.

రెండు రోజుల్లో మరమ్మతులు చేస్తాం..  
మరమ్మతులకు గురైన  ఏసీలు, ఫ్యాన్లను రెండు రోజుల్లో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తాం.  మరమ్మతులల కోసం మూడు నెలల క్రితమే టెండర్లు పిలిచాం, టెండరు దక్కించుకున్న ఎల్‌–1 టెండరుదారు ఇంతవరకు పత్తా లేకుండా పోయాడు, ఎల్‌–2 టెండరుదారుకు ఖరారు చేసి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తెసాం.
శ్రవణ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top