
ఒక్కచోట నుంచే ఈ-చలానాలు
జంట కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి హైదరాబాద్ నుంచే ఈ చలానాలు పంపిణీ చేయనున్నారు.
- సీసీ కెమెరాల అనుసంధానం
- హైదరాబాద్ కంట్రోల్ రూంలో ఏర్పాట్లు
- ఆగస్టు నుంచి అమలు
- పెండింగ్‌లో 66 లక్షల కేసులు
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి హైదరాబాద్ నుంచే ఈ చలానాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇందుకోసం నగరంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తున్నారు. హైదరాబాద్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కేసు నమోదు చేసి ఆయా కమిషనరేట్ల పరిధిలో ఈ చలానాలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో ఈ చలానాల వడ్డింపులకు గురైన వారు హైదరాబాద్‌లో దర్జాగా తిరిగే వారు. అలాగే హైదరాబాద్‌లో జరిమానా పడిన వారు సైబరాబాద్‌లో తిరిగేవారు. ఒకరి పరిధిలోని కేసులు మరో పరిధిలోని అధికారులకు తెలిసేవి కావు. ఈ విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలోని 450 కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచే రెండు కమిషనరేట్లకు చెందిన ఈ చలానాల రసీదులను వాహనదారుడికి పంపిణీ చేస్తారు. ఆగస్టు నెల ప్రారంభం నుంచే ఇది అమల్లోకి రానుంది.
ఈ చలానా అంటే...
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు పలు చౌరస్తాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉల్లంఘనుల భరతం పట్టేవారు. కెమెరాల ద్వారా వాహనం నంబరు గుర్తించి దాని ద్వారా వాహనదారుడి చిరునామాను సేకరించి జరిమానాలు వడ్డిస్తారు. ఈ చలానా రసీదును ఇళ్లకు పంపుతారు. జరిమానాను వాహనదారులు నేరుగా కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న బూత్‌లోగాని, ఈ సేవ కేంద్రంలో కాని చెల్లించాలి. రుసుము చెల్లించగానే కంట్రోల్ రూమ్‌లో నమోదైన సదరు వాహనదారుడి వివరాలు ఈ చలానా నుంచి తొలగిస్తారు.
పెండింగ్‌లో 66 లక్షలు
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ చలానా కేసులు సుమారు 66 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చలానాలు అందుకున్నవారిలో చాలా మంది జరిమానా చెల్లించడం లేదు. హైదరాబాద్ పరిధిలో 36,48,000, సైబరాబాద్ పరిధిలో 30 లక్షల ఈ చలానా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ హైదరాబాద్ నుంచి సుమారు 7000కుపైగా, సైబరాబాద్ నుంచి 5000కుపైగా ఈ చలానాలను పంపిస్తున్నారు.