సాక్షి హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలిసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు పేర్కొంది బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా వారి ఇంటి వద్దే ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఈ రోజుల్లో పోలీస్‌స్టేషన్ భయంతో చాలా వరకూ నేరాలు వెలుగులోకి రావడం లేదు. పోలీసు స్టేషన్ వెళ్లాలంటే సామాజికంగా తమపై ప్రభావం పడుతుందనే భయంతో పాటు ఆర్థికంగా కొంత భారం కారణంగా చాలామంది అక్కడికి వెళ్లడానికి మెుగ్గు చూపరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారుల కేసులతో పాటు పోక్సో చట్టం ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు తెలిపింది.
వీటితో పాటు శారీరక దాడులు, ఆస్తి వివాదాల కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. బీఎన్‌ఎస్ న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదు స్వీకరించి అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితులకు అందజేయనున్నట్లు పేర్కొంది. సాక్ష్యాల సేకరణ అక్కడికక్కడే చేయనున్న తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లలో ఈ కొత్త నియమాలు సత్వరమే అమలులోకి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


