తొలి అరగంట ఫ్రీ

Free parking for 30 minutes in city malls from April 1 - Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి నగరంలో పార్కింగ్‌ పాలసీ పక్కాగా అమలు  

మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థల్లోనిబంధనలు పాటించాల్సిందే

లేకుంటే కఠిన చర్యలు తప్పవు

పార్కింగ్‌ వివరాలు తప్పక డిస్‌ప్లే చేయాలనిజీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశం

నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల పార్కింగ్‌ పాలసీని కచ్చితంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.  రాష్ట్ర ప్రభుత్వం నగరంలో పార్కింగ్‌ విధానాన్ని నిర్ణయిస్తూ ఈ నెల 20వ తేదీన
జీవో నెంబర్‌ 63 జారీ చేసింది. ఈ జీవో మేరకు..మాల్స్,మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థల్లో 30 నిమిషాల వరకు ఉచితపార్కింగ్‌ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలుఅమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఈమేరకు ఆయనగురువారం నగరంలోని మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్యసముదాయాల యజమానులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్కింగ్‌ పాలసీ గురించివారికి వివరించారు. 

సాక్షి, సిటీబ్యూరో:నగరంలో ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి పార్కింగ్‌ పాలసీని కచ్చితంగా అమలు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పార్కింగ్‌ పాలసీ అమలుపై గురువారం మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్యసముదాయాల యజమానులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్రప్రభుత్వం నగరంలో పార్కింగ్‌ విధానాన్ని నిర్ణయిస్తూ ఈనెల 20వ తేదీన జీవో(నెంబర్‌63) జారీ చేసిందన్నారు. జీవో మేరకు..మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్యసంస్థల్లో 30 నిమిషాల వరకు ఉచిత పార్కింగ్‌ కల్పించాల్సి ఉంటుందన్నారు. 30 నిమిషాల నుండి గంట వరకు ఆయా మాల్స్, మల్టీప్లెక్స్‌లలో షాపింగ్‌ చేసినట్లు బిల్లు చూపించిన వారికి ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి బిల్లులు చూపని వారికి నిర్ణీత పార్కింగ్‌ ఫీజు వసూలు చేయవచ్చునని తెలిపారు. నగరంలో పార్కింగ్‌ చార్జీలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సవివరమైన పార్కింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. వీటిని అమలు చేయనివారిపై నిబంధనల మేరకు తగిన చర్యలుంటాయన్నారు. 

వాహనం పార్కింగ్‌ చేసిన సమయాన్ని,  తెలుపుతూ  స్టాంప్‌ వేయడమో, లేక తగిన డివైజ్‌ను వినియోగించడమో చేయాలని కమిషనర్‌ సూచించారు. పార్కింగ్‌ ఫీజుల సమాచారాన్ని, జీవో ప్రతులను అందరికీ కనిపించేలా అంటించాలని, పెయింటింగ్‌ వేయించాలని సూచించారు. నగరంలో 9,100 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా, వాహనాలు మాత్రం 54 లక్షలున్నాయంటూ, పార్కింగ్‌ సమస్య పరిష్కారానికిగాను ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిల్లో  తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని త్వరలోనే రూపొందిస్తామన్నారు. కాగా మాల్స్, మల్టీప్లెక్స్‌ ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని, ప్రధానంగా ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసుల స్థానంలో స్టీల్‌ గ్లాస్‌లను వినియోగించాలని కమిషనర్‌ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ, జోనల్‌ కమిషనర్లు హరిచందన, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. కాగా సమావేశానికి హాజరైన వారికి పార్కింగ్‌ పాలసీ గురించి తెలియజేశాక, అమలుకు తగినంత గడువిస్తే బాగుండేదన్నారు. పార్కింగ్‌పైఆధార పడ్డ ఎందరికో జీవనోపాధి పోతుందన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంలో కూడా పార్కింగ్‌ ఫీజుందని ప్రస్తావించారు.

పార్కింగ్‌  ఫీజులిలా..
30 నిమిషాల వరకు:ఎవరి నుంచి ఎలాంటి పార్కింగ్‌  ఫీజు వసూలు చేయరాదు. బేషరతుగా ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పించాల్సిందే.
31 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు:సదరు షాపింగ్‌ సెంటర్‌లో ఏదైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరు. బిల్లు చూపని పక్షంలో నిర్ణీత పార్కింగ్‌ ఫీజు వసూలు చేయవచ్చు.
గంట దాటితే:ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు లేదా సినిమా టిక్కెట్‌ చూపించాలి. పార్కింగ్‌ ఫీజు మొత్తం కంటే సినిమా టిక్కెట్‌ / కొనుగోళ్లకు బిల్లు ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top