కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సిటీ పోలీస్‌ అండ

Free Coaching And Staff Motivation in Hyderabad Police - Sakshi

ఉచిత శిక్షణతో పాటు సాధనకు తోడ్పాటు

మరికొద్ది రోజుల్లో మెయిన్స్‌

సిబ్బంది మోటివేషన్‌.. అభ్యుర్థుల సాధన  

నాంపల్లి: ఉద్యోగం అది చిన్నదా పెద్దదా అనికాదు.. అది ప్రభుత్వ కొలువా కాదా అన్నది పాయింటు. గవర్నమెంట్‌ జాబ్‌కున్న విలువే వేరు. అలాంటిది ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం యువత రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటికే దేహధారుడ్య పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో పాసైన వారికి మెయిన్‌ పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో ఎంపికైన ఈ అభ్యర్థును త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బందోబస్తుకు వినియోగించుకునే యోచనలో పోలీస్‌ శాఖ ఉంది.

ఒక వైపు భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా మరోక వైపు ఈ పరీక్షల్లో పాసై ఉద్యోగాలను పొందేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌ పరీక్షకు సైతం లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒకప్పుడు ఈ పోటీలో గెలవాలని వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆసక్తి గల నిరుద్యోగులకు నగర పోలీస్‌ విభాగం అందిస్తున్న ఉచిత శిక్షణలో తర్ఫీదునిస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించాక నిరుపేద కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌లో అన్ని పరీక్షలకు ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు దేహధారుఢ్య ప్రాక్టీసుతో పాటు రాత పరీక్షలనునిర్వహిస్తున్నారు.

2016 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణలో ఇప్పటి దాకా ఒక బ్యాచ్‌ను పూర్తస్థాయిలో సన్నద్ధం చేశారు. రెండో బ్యాచ్‌ తరగతులు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఆరు జోన్లలో పోలీస్‌ కానిస్టేబుల్స్‌కు ఉచితంగా కేటాయించిన  ఆట స్థలాల్లో శిక్షణ కొనసాగుతోంది. గోషామహాల్‌ గ్రౌండ్స్‌లో శిక్షణ పొందిన వెయ్యి మంది అభ్యర్థుల్లో 700 మంది మెయిన్స్‌ పరీక్షకు ఎంపికయ్యారు. మెయిన్‌ పరీక్షకు ఎంపికైన మహిళా అభ్యర్థుల సక్సెస్‌ మీట్‌ను శుక్రవారం కోచింగ్‌ ఇన్‌చార్జి పరవస్తు మధుకర్‌ స్వామి మల్లేపల్లిలోని అన్వర్‌ ఉలూం డిగ్రీ కళాశాలలో నిర్వహించగా పలువురు అభ్యర్థులు ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..  

విజేతలను తయారు చేస్తాం  
రెండో బ్యాచ్‌ శిక్షణలో వెయ్యి మంది అభ్యర్థులకు అవకాశంకల్పించాం. గోషామహాల్‌లో శిక్షణ పొందినవారిలో 700 మంది ప్రిలినరీ పాసయ్యారు. 216 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. త్వరలో జరిగే మెయిన్స్‌లో మొత్తం 600 మంది కానిస్టేబుల్స్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పది మంది నిపుణులు రూపొందించిన ప్రశ్నపత్రాలను మోడల్‌ పేపర్లుగా ఇస్తున్నాం. – పరవస్తు మధుకర్‌స్వామి, ఇన్‌స్పెక్టర్‌

ప్రోత్సాహం ఎంతో అవసరం  
పోటీ పరీక్షల్లో బహుముఖ అంశాలతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగే సామర్థం ఉండాలి. అప్పుడే మనం టాప్‌గా నిలుస్తాం. నిరంతరం ప్రాక్టీసు చేయాలి. అన్ని అంశాలపై పట్టు సాధించాలి. అన్నింటికి మించి మన చదువుకు తోడు మోటివేషన్‌ కూడా ముఖ్యమని గ్రహించాలి.– ఫిబా డేవిడ్, 2018 బ్యాచ్‌ విజేత

మొదటి బ్యాచ్‌రికార్డు బ్రేక్‌..  
గోషామహాల్‌లో గ్రౌండ్‌లో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్‌ అభ్యర్థుల్లో 257 మంది విజయం సాధించారు. కానిస్టేబుల్స్‌గా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మొదటి బ్యాచ్‌ రికార్డును రెండవ బ్యాచ్‌ అభ్యర్థులు బ్రేక్‌ చేయాలి. నగరంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లో చూసినా వెస్ట్‌జోన్‌ పోలీసులే కనిపించాలి. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష పాసైనవారికి త్వరలో మెయిన్స్‌నిర్వహిస్తాం.– నరేందర్‌ రెడ్డి, గోషామహాల్‌ ఏసీపీ

పోలీస్‌ విభాగం అండతో..
ఈ ఉద్యోగమంటే చాలా మందికి నిరాసక్తత కనిపిస్తుంది. మహిళలంటే చెప్పాల్సిన పనిలేదు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ శిక్షణ తీసుకున్నాను. నా లక్ష్యానికి పోలీస్‌ విభాగం తోడ్పాటునిచ్చింది. ప్రిలిమ్స్‌ పాసయ్యాను. మెయిన్స్‌ కూడా గెలుస్తాను. – రవళిక, మెహిదీపట్నం

మెయిన్స్‌ సులభమే  
కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికవ్వాలంటే ఎంతో కష్టపడాలి. గ్రౌండ్స్‌లో విజయం సాధిస్తే తప్ప రాత పరీక్షకు అర్హత సాధించలేం. పరుగు, లాంగ్‌జంప్, హైజంప్‌ వంటి అంశాల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలి. ఇక్కడి శిక్షణతో మెయిన్స్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాదు. – కిరణ్మయి, అల్మాస్‌గూడ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top