ఆవిర్భావ ఉత్సవాలు భారీగా వద్దు

Formation Festivals Do Not Be Heavy Says Kodandaram - Sakshi

29న ఎక్కడికక్కడ జెండాలు ఎగరేయండి: కోదండరాం

జూన్‌లో రాష్ట్రస్థాయి ప్లీనరీ నిర్వహణకు పార్టీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) ఆవిర్భావ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌లో రాష్ట్రస్థాయిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినా.. రాష్ట్రంలో ఇంటర్‌ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాటిని భారీగా నిర్వహించవద్దని కోరారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా రాష్ట్రాన్ని ఒక కుటుంబం గుత్తసొత్తుగా మార్చుకున్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకు టీజేఎస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై టీజేఎస్‌ నిర్వహించిన పోరాటాలతో ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగాయని కోదండరాం పేర్కొన్నారు. ఈ నెల 29న అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్‌ బోర్డు ఎదుట నిర్వహించనున్న ధర్నాలో సంఘీభావం తెలియజేయాలని టీజేఎస్‌ అధికార ప్రతినిధి, మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్‌ వెదిరె యోగేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.  

కిషన్‌రెడ్డికి టీజేఎస్‌ నేతల పరామర్శ...
బీజేపీ నేత కిషన్‌రెడ్డిని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఇతర నాయకులు పరామర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో ఆయనను కలిసి తమ సంతాపాన్ని తెలియచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top