
ప్రయాణికుడి వద్ద పట్టుబడిన విదేశీ కరెన్సీ
శంషాబాద్(రాజేంద్రనగర్) : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎఫ్‌జడ్436 విమానంలో దుబాయ్ బయలుదేరడానికి వచ్చిన వ్యక్తిని ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేయగా.. హ్యాండ్ బ్యాగ్‌లో విదేశీ కరెన్సీ దొరికింది.
కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఒమన్, సౌదీ దేశాల కరెన్సీ ఉంది. భారత కరెన్సీలో వాటి విలువ రూ.39,86,195 ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడు ఇదే తరహాలో రెండోసారి పట్టుబడడం గమనార్హం. ఈ నోట్లను అనధికార డీలర్ నుంచి తీసుకుని విదేశాలకు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.